తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉత్కంఠ పోరుకు భారత్​- పాక్​ రె'ఢీ'

ఇండియా.. పాకిస్థాన్​... ఈ రెండు దేశాలు క్రికెట్లో తలపడితే అభిమానులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ప్రపంచకప్​ లాంటి మెగా సంగ్రామంలో అయితే మరీనూ. అదే ఉత్సాహంతో మెగాటోర్నీ​లో మరోసారి అభిమానుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాయి భారత్​-పాక్​ జట్లు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​. భారత్​- కివీస్​ మ్యాచ్​ రద్దుకు కారణమైన వరుణుడు దాయాది పోరుకు ఆటంకం కలిగించకూడదని కోరుకుంటున్నారు క్రికెట్​ ప్రేమికులు.

ఉత్కంఠ పోరుకు భారత్​- పాక్​ రె'ఢీ'

By

Published : Jun 15, 2019, 5:48 PM IST

Updated : Jun 16, 2019, 9:48 AM IST

భారత్​ వర్సెస్​ పాక్​.. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్​ సంగ్రామం అంటే ఎక్కడా లేని ఆసక్తి. ఇరు దేశాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా దాయాది జట్ల పోరు అంటే ప్రత్యేకమే. మైదానంలో అంతలా తలపడతాయి ఇరు జట్లు.

అభిమానులతో పాటు... ఆటగాళ్లూ మ్యాచ్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కదన రంగంలోకి దిగుతారు. ఎలాగైనా మ్యాచ్​ గెలవాలని ఊవిళ్లూరుతుంటారు. దాయాదిపై వ్యక్తిగతంగా శాయశక్తులా ప్రదర్శన చేయాలని ప్రతి ఆటగాడూ కోరుకుంటాడు.

అందుకే ప్రపంచ క్రికెట్​ అభిమానులకు మరోసారి అసలు సిసలైన మజాను రుచిచూపించడానికి సిద్ధమవుతున్నాయి ఈ ఉపఖండ జట్లు. మెగా టోర్నీలో హోరాహోరీ పోరు కోసం నేడు రంగంలోకి దిగుతున్నాయి. మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ప్రపంచకప్​ టోర్నీల్లో తిరుగులేని భారత్​...

టీమిండియా

భారత్​, పాక్​ ద్వైపాక్షిక సిరీస్​లు ఆడక 6 సంవత్సరాలు దాటింది. చివరిసారిగా 2012-13లో భారత్​లో పర్యటించింది పాక్​. అనంతరం భారత్​ పాక్​కు గాని.. పాకిస్థాన్​​ భారత్​కు గానీ.. క్రికెట్​ కోసం రాలేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడ్డాయి ఇరు జట్లు. అయితే.. అందులోనూ పూర్తి ఆధిపత్యం టీమిండియాదే. పాకిస్థాన్​ ఇప్పటివరకు ప్రపంచకప్​ టోర్నీల్లో భారత్​పై గెలిచిందే లేదు. వన్డే ప్రపంచకప్​లో ముఖాముఖి 6 సార్లు తలపడగా.. అన్ని సార్లు భారత్​దే విజయం.

ప్రపంచకప్​లో ఇరు జట్లు...

ప్రపంచ కప్​ ఫలితం మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్
1992 43 పరుగుల తేడాతో భారత్​ గెలుపు సచిన్​ తెందుల్కర్​
1996 39 పరుగుల తేడాతో భారత్​ గెలుపు నవ్​జోత్​ సిద్ధూ
1999 47 పరుగుల తేడాతో టీమిండియా విజయం వెంకటేశ్​ ప్రసాద్​
2003 6 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు సచిన్​ తెందుల్కర్​
2011 29 పరుగుల తేడాతో భారత్​ విజయం సచిన్​ తెందుల్కర్​
2015 76 పరుగులు తేడాతో భారత్​దే మ్యాచ్ విరాట్​ కోహ్లీ​

ఇప్పుడు ఏడో సారి బరిలోకి దిగుతున్నాయి భారత్​, పాక్​ జట్లు. గెలుపు రుచి కోసం పాకిస్థాన్​... మళ్లీ దెబ్బకొట్టేందుకు భారత్​ మ్యాచ్​ ఆడనున్నాయి. అభిమానులూ రసవత్తర పోరును కోరుకుంటున్నారు.

ఒకే గెలుపుతో పాక్​.. ఓటమి లేని భారత్​

ప్రస్తుత ప్రపంచకప్​ టోర్నీని అద్భుతంగా ప్రారంభించింది టీమిండియా. తొలి మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై, తర్వాత ఆస్ట్రేలియాపై అలవోక విజయాలు సాధించింది. హోరాహోరీగా సాగుతుందని ఊహించిన కివీస్​తో మ్యాచ్​ వర్షం కారణంగా టాస్​ పడకుండానే రద్దయింది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి

2019 ప్రపంచకప్- భారత్​​ ప్రదర్శన..

  • దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపు
  • ఆస్ట్రేలియాపై 36 పరుగుల తేడాతో విజయం
  • న్యూజిలాండ్​తో మ్యాచ్​ వర్షం కారణంగా​ రద్దు

పాయింట్ల పట్టికలో భారత్​ది పైనుంచి నాలుగో స్థానమైతే.. పాక్​ది కిందినుంచి రెండో ర్యాంకు. 3 మ్యాచ్​ల్లో 2 విజయాలు సాధించి 5 పాయింట్లతో ఉంది కోహ్లీ సేన.
పాక్​.. 4 మ్యాచ్​లాడి ఒకే విజయం సాధించింది. 2 మ్యాచ్​ల్లో ఓటమిపాలైంది.

2019 ప్రపంచకప్- పాక్​​ ప్రదర్శన

  • వెస్టిండీస్​ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి
  • ఇంగ్లాండ్​పై 14 పరుగుల తేడాతో గెలుపు
  • శ్రీలంకతో మ్యాచ్​ వర్షం కారణంగా రద్దు
  • ఆస్ట్రేలియా చేతిలో 41 పరుగుల తేడాతో పరాజయం

అందరూ ఫామ్​లోనే...

రోహిత్ శర్మ

టీమిండియాలో అందరూ మంచి ఫామ్​లో ఉన్నారు. ధావన్​ లేని లోటు మ్యాచ్​పై కచ్చితంగా ఉంటుంది. ఆస్ట్రేలియాపై సెంచరీతో విజయం సులువు చేశాడు గబ్బర్​. వేలి గాయం కారణంగా దాదాపు 3 మ్యాచ్​లకు దూరమయ్యాడు శిఖర్​.

ధావన్​ లోటుతో ఓపెనింగ్​లో రాహుల్​ ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. రోహిత్​ మంచి ప్రదర్శనలు చేస్తున్నాడు. 2 మ్యాచ్​లలో 179 పరుగులు చేశాడు. మూడో స్థానంలో కోహ్లీ ఉండనే ఉన్నాడు. నాలుగో స్థానంలో దినేష్​ కార్తీక్​, విజయ్​ శంకర్​లలో ఎవరిని తీసుకుంటారో స్పష్టత లేదు. మిడిలార్డర్​ ధోని, జాదవ్​, పాండ్యలతో పటిష్ఠంగా ఉంది. ముఖ్యంగా ధోని, పాండ్య దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచుతున్నారు.

మహేంద్ర సింగ్ ధోని

భారత బౌలింగ్​ దళం బలంగా ఉంది. బుమ్రా, భువనేశ్వర్​, పాండ్య పేస్​ విభాగాన్ని పంచుకోనున్నారు. స్పిన్నర్లలో చాహల్​ ఆకట్టుకుంటున్నాడు. భారీగా పరుగులిస్తున్న కుల్​దీప్​ స్థానంలో షమి వచ్చే అవకాశముంది. దాయాదిపై మ్యాచ్​లో వీరంతా సమష్టిగా రాణిస్తే విజయం తేలికే అవ్వొచ్చు.

నిలకడలేమితో పాక్​...

పాకిస్థాన్ క్రికెట్ జట్టు

అనిశ్చితికి మారు పేరైన పాక్​.. ఎప్పుడెలా ఆడుతుందో చెప్పడం కష్టం. గెలిచే మ్యాచ్​ను చేజేతులా పోగొట్టుకోవాలన్నా.. కష్టమనుకున్న దశలో అనూహ్యంగా గెలవాలన్నా పాక్​కే చెల్లుతుంది. అయితే.. ప్రపంచకప్​లో ఇప్పటివరకు భారత్​పై గెలవని పాకిస్థాన్​.. ఈ మ్యాచ్​లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో..

  1. ఆ జట్టులో ఎన్నో అంచనాలున్న ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోతున్నారు. ఓపెనర్లు ఇమాముల్​ హక్​, ఫకర్​ జమాన్​ మంచి భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోతున్నారు. మిడిలార్డర్​లో బాబార్​ అజామ్​, హఫీజ్​లు నిలకడగా ఆడుతున్నారు. హఫీజ్​ పాక్​ తరఫున టాప్​ స్కోరర్​గా ఉన్నాడు. వీరిద్దరూ ఆడితే పాక్​ భారీ స్కోరు చేయొచ్చు.
    పాక్ బ్యాట్స్​మెన్ హఫీజ్,బాబర్ ఆజమ్
  2. బౌలింగ్​లో ఆమిర్​ చెలరేగిపోతున్నాడు. ఆలస్యంగా ప్రపంచకప్​ జట్టులోకి వచ్చిన ఈ యువపేసర్​ నిప్పులు చెరిగే బంతులతో హడలెత్తిస్తున్నాడు. 3 మ్యాచ్​ల్లో 10 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు వాహబ్​ రియాజ్​, షాహీన్​ అఫ్రిదీల నుంచి ఆమిర్​కు సరైన సహకారం లభించట్లేదు.
    పాకిస్థాన్ బౌలర్ ఆమిర్

తొలి మ్యాచ్​లో వెస్టిండీస్​పై 105 పరుగులకే కుప్పకూలిన పాక్​... తన రెండో మ్యాచ్​లో ఆతిథ్య బలమైన ఇంగ్లాండ్​పై 348 పరుగుల భారీ స్కోరు చేసి గెలిచింది. అనంతరం ఆసీస్​తో పోరాడి ఓడింది.

పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్

తనదైన రోజునా ఎంతటి జట్టునైనా ఓడించగలిగిన పాక్​... భారత్​తో మ్యాచ్​లో ఎలా ఆడుతుందనన్నది ఆసక్తికరంగా మారింది. మరోసారి ఈ ప్రపంచకప్​ టోర్నీలో ఫేవరేట్​గా బరిలోకి దిగిన కోహ్లీసేన పాక్​పై అదే ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది. ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

Last Updated : Jun 16, 2019, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details