ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో అత్యద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతున్నాడు. కేరళలోని పారంబికులం పులుల సంరక్షణ కేంద్రానికి విహారయాత్రకు వెళ్లిన అతడు.. అందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. తన కుమార్తెతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకొని సంబరపడ్డాడు.
"తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ప్రకృతి సౌందర్యం, దాని విశిష్టతను తెలియజేయండి. అదే మనం వారికిచ్చే అతిగొప్ప బహుమతి" అని పేర్కొన్నాడు. మరోవైపు అశ్విన్ సతీమణి ప్రీతి సైతం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. దానికి 'మాస్క్ అప్' అని వ్యాఖ్యానించింది. అందులో ముగ్గురూ ఏనుగుల సమీపంలో నిల్చొని ఫొటోకు పోజిచ్చారు. ప్రస్తుతం కరోనా వైరస్ నెలకొన్న పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని ప్రీతి చెప్పకనే చెప్పింది.