మెగాటోర్నీల్లో టీమ్ఇండియా చివరి దశలో ఒత్తిడికి గురవుతుందని తెలిపాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. కఠిన సమయాల్లో ఒత్తిడి లేకుండా ఆడాలంటే ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండాలని తెలిపాడు. ఈ మానసిక స్థైర్యం కొరవడిన ఫలితంగా ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో తమ సత్తా చాటలేకపోతున్నారని స్పష్టం చేశాడు గౌతీ.
"కఠిన సమయాల్లో చేసిన ప్రదర్శనే మనం ఉత్తమ ఆటగాళ్లమా కాదా అనేది నిర్ణయిస్తుంది. నాకు తెలిసి మనం ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం. టోర్నీ మొత్తం బాగానే ఆడి నాకౌట్ దశలో విఫలమవడమనేది మన మానసిక దృఢత్వం ఎంతవరకు ఉందో తెలియజేస్తుంది. మనకు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచే సత్తా ఉన్నా.. ఆ స్థాయిలో ప్రదర్శన చేయకపోతే మనని ఎవరూ ఛాంపియన్లుగా గుర్తించరు."