టెస్టుల్లో భారత్ నంబర్‌వన్‌గా నిలవడం, ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో తెరవెనుక ప్రధాన కోచ్ రవిశాస్త్రి పాత్ర ఎంతో ఉంది. కుర్రాళ్లకు పెద్దన్నగా వ్యవహరిస్తూ.. అనుభవాన్ని పంచుతున్న ఈ మాజీ ఆల్‌రౌండర్.. ఇంగ్లాండ్‌పై భారత్ టెస్టు సిరీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. బయో బుడగ ఆటగాళ్ల మధ్య అనుబంధాన్ని పెంచిందని అంటున్న శాస్త్రి.. కుర్రాళ్లు రిషభ్ పంత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ప్రదర్శనపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
బబుల్ మంచే చేసింది..
భారత జట్టు బయో బుడగలో సుదీర్ఘ కాలంగా ఉంటుంది. ఇందులో ఉన్నప్పుడు ఆటగాళ్లకు వేరే అవకాశం ఉండదు. బయటకు వెళ్లలేరు. కొన్ని అనుమతించిన స్థలాల్లోనే తిరగాలి. బస చేసిన గది నుంచి బయటకు వస్తే జట్టు కలుసుకునే చోటుకే వెళ్లాలి. అంటే దీని వల్ల మ్యాచ్ అయిన తర్వాత కూడా క్రికెటర్లు ఎక్కువసార్లు కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా కలవడం వల్ల ఆట గురించి చర్చ వస్తుంది. మా సమయంలో ఇలా మ్యాచ్ అయ్యాక కూడా ఎక్కువసేపు ఆట గురించి మాట్లాడుకునే వాళ్లం.
బయో బుడగలో క్రికెట్ తప్ప వేరే ఆలోచనకు చోటే లేదు. వాళ్లకు అది తప్పనిసరి అయింది. అంతేకాదు క్రికెటర్ల మధ్య అనుబంధం పెరిగింది. ఒకరి నేపథ్యం గురించి మరొకరు తెలుసుకోవడం, ఎక్కడి నుంచి వచ్చారో.. జీవితంలో స్థిరపడ్డారా.. ఇంకా స్థిరపడే దశలో ఉన్నారా.. మానసిక స్థితి ఎలా ఉంది లాంటి విషయాలను ఆకళింపు చేసుకునే అవకాశం కలిగింది. ఒకరితో ఒకరు వ్యక్తిగత విషయాలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం వల్ల బంధాలు బలపడ్డాయి. ఇలాంటి ఎన్నో సానుకూలాంశాలు బయో బుడగలో ఉన్నాయి.
అందుకే ఈ విజయాలు..
ప్రస్తుత భారత జట్టు గెలవడాన్ని గర్వంగా భావిస్తోంది. ఒక్కోసారి ఓటములు ఎదురైనా దిగులు పడట్లేదు. మళ్లీ సానుకూల ఫలితం వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూస్తోంది. ఆరు నెలలు ఆటగాళ్లు లాక్‌డౌన్‌లో గడిపిన సంగతి మాకు తెలుసు. అందుకే వారికి కుదురుకునే సమయం కావాలని అర్థం అయింది. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడిన తర్వాత మూడో వన్డేలో విజయం ఈ కోవకే చెందుతుంది. ఈ గెలుపు తర్వాత టీమ్‌ఇండియా వెనక్కి తిరిగి చూడలేదు. టీ20లతో పాటు చరిత్ర సృష్టిస్తూ టెస్టు సిరీస్ నిలబెట్టుకుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడినా.. ఆ తర్వాత మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.