గాయాలతో ప్రధాన ఆటగాళ్లు దూరమైనా ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా అద్భుత విజయం సాధించిందని ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కొనియాడాడు. గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో ఆసీస్‌పై భారత్ గెలవాలని తమ జట్టు కోరుకుందని తెలిపాడు. అయితే ఇప్పుడు భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్ జరగనున్న నేపథ్యంలో.. రెండు వారాల క్రితం ప్రశంసించిన టీమ్ఇండియానే, ఇప్పుడు శత్రువుగా భావించాల్సి వస్తుందని అన్నాడు. అయితే టీమ్ఇండియాయాను అలా ఊహించుకోలేమని పేర్కొన్నాడు.
"భారత్ పర్యటన అంత తేలిక కాదు. గబ్బాలో ఆస్ట్రేలియాపై విజయంతో టీమ్ఇండియా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే గబ్బా టెస్టులో భారత్‌కే మా జట్టు మద్దతు ఇచ్చింది. సమష్టి పోరాటం, సంకల్పం, గెలవాలనే స్ఫూర్తితో అద్భుత ప్రదర్శన చేసింది. గాయాలతో ఆటగాళ్లు దూరమైనా టీమిండియా చేసిన పోరాటాన్ని చూసి.. ప్రపంచంలో ఉన్న ఏ జట్టు అయినా ఎంతో గర్వపడుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కోహ్లీసేన ఉండటానికి కారణమిదే. అయితే రెండు వారాల క్రితం వాళ్ల ప్రదర్శనను అభిమానించిన మేం.. ఇప్పుడు టీమ్ఇండియాను శత్రువులుగా భావించాల్సి వస్తుంది. అయితే అలా ఊహించలేం."