టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలకడని వెస్టిండీస్ స్టార్ ఆటగాడు డ్వేన్ బ్రావో ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో.. మిస్టర్ కూల్ తప్పకుండా ఆడతాడని అన్నాడు.
"ధోనీ రిటైర్మెంట్ ఇవ్వడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఆడతాడనే అనుకుంటున్నా. మైదానం బయట జరిగే సంఘటనల ప్రభావం తనపై ఉండనివ్వడు. మాకూ అదే నేర్పాడు. ఎప్పుడూ భయపడొద్దని, సామర్థ్యంపై నమ్మకం ఉంచాలని చెప్పేవాడు."
- డ్వేన్ బ్రావో, విండీస్ క్రికెటర్
ఐపీఎల్లో మహీ సారథ్యంలోనిచెన్నై సూపర్‌కింగ్స్‌కుడ్వేన్ బ్రావో ఆడుతున్నాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్రావో.. త్వరలో పునరాగమనం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలె ప్రకటించాడు. విండీస్ బోర్డులో సానుకూల మార్పుల వల్లే అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేస్తున్నట్లు ఈ కరీబియన్ ఆటగాడు వెల్లడించాడు.
"శారీరకంగా బాగున్నాను. ఇంకా ఆడగలను. మైదానం బయట రాజకీయాలతో వీడ్కోలు పలికాను. ప్రస్తుతం మైదానంలో, బయటా నాయకత్వ మార్పులు జరిగాయి. పునరాగమనానికి ఇదే మంచి సమయం. టీ20 ప్రపంచకప్‌నకు ఏడాది సమయం ఉంది కాబట్టి దానికి సన్నద్ధం కాగలను. నేను ప్రశాంతంగా ఉంటాను. ఒత్తిడికి లోనుకాను. టీ20ల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రశాంతత చాలా అవసరం" అని బ్రావో అన్నాడు.
విండీస్ కోచ్ ఫిల్ సిమన్స్, కెప్టెన్ కీరన్ పొలార్డ్ నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు బ్రావో. వీరిద్దరితో మంచి సంబంధాలున్నాయని పరోక్షంగా తెలిపాడు.
ఏడాది తర్వాత వస్తున్నాడు...
బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏడాది దాటింది. 2012, 2016లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్ జట్టులో బ్రావో సభ్యుడు. 2016 సెప్టెంబర్‌లో చివరిగా ఆ దేశ జెర్సీ ధరించాడీ స్టార్ క్రికెటర్. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు బ్రావో. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా విండీస్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఇతడు చోటు దక్కించుకున్నాడు. అయితే ప్లే ఎలెవన్‌లో మాత్రం అవకాశం రాలేదు.