క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఈనెల 29 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇందులో గెలవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే 3-0తో వన్డే సిరీస్, పది వికెట్ల తేడాతో తొలి టెస్టును కైవసం చేసుకున్న కివీస్.. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది.
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొలి ఓటమి రుచిచూసిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెగ్లే ఓవల్ వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.
ఈ మైదానంలో తొలిమ్యాచ్..
రెండో టెస్టు జరిగే క్రైస్ట్‌చర్చ్ నగరంలో రెండు క్రికెట్ మైదానాలు ఉన్నాయి. ఏఎంఐ స్టేడియం ఒకటి, హెగ్లే ఓవల్ స్టేడియం మరొకటి. భారత జట్టు ఇదివరకు ఏఎంఐ మైదానంలో నాలుగు టెస్టులు ఆడగా.. రెండు ఓటమిపాలై, మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగించింది. 2014 నుంచి టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న హెగ్లే ఓవల్‌లో.. భారత్ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. శనివారం ప్రారంభమయ్యే రెండో టెస్టే భారత్‌కు అక్కడ తొలి మ్యాచ్. అలాగే కివీస్ ఈ మైదానంలో ఆడిన ఆరు టెస్టుల్లో నాలుగు గెలిచి, ఒకటి ఓటమిపాలై, మరొక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
క్రైస్ట్‌చర్చ్‌లో తొలిసారి ఆడుతున్న కోహ్లీసేన.. రెండో టెస్టులో జయకేతనం ఎగరవేయాలని చూస్తోంది. ఒకవేళ భారత జట్టు గెలిస్తే అదో కొత్త రికార్డు అవుతుంది.