ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగే చివరి టెస్టులో ఓడిపోతామని తెలిసే టీమ్ఇండియా అక్కడ మ్యాచ్ ఆడేందుకు వెళ్లనంటోందని ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. క్వారంటైన్లో ఉండటం ఇష్టం లేదని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించాడు.
"క్రికెట్ వైపు నుంచి చూస్తే.. భారత్ ఎందుకు గబ్బాకు వెళ్లాలనుకుంటుంది? అక్కడ ఆసీస్‌పై ఏ జట్టూ గెలవదు. ఆ మైదానంలో కంగారూ ఆటగాళ్లు గొప్పగా ఆడతారు. కొతం కాలం నుంచి అక్కడ ప్రత్యర్థి గెలిచిన దాఖలాలు లేవు. ఆటగాళ్లు చాలా రోజుల నుంచి బబుల్‌లో ఉన్న మాట నిజమే. దీంతో వాళ్లకు విసుగ్గా అనిపించొచ్చు. కానీ ఓ రాష్ట్రంలో వైరస్ లేనపుడు టెస్టు మ్యాచ్‌ను అక్కడి నుంచి తరలించకూడదు. క్వారంటైన్లో ఉండటం ఇష్టం లేదని చెప్పడం సరికాదు. ఈ ఆంక్షల గురించి వాళ్లకు ముందే తెలుసు. మొదట ఐపీఎల్, ఇప్పుడు ఆసీస్ పర్యటన కోసం వాళ్లు క్వారంటైన్లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లది కూడా అదే పరిస్థితి కదా. కానీ వాళ్లు అలా అనట్లేదు. భారత్ గబ్బాలో ఆడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది." అని హాడిన్ చెప్పాడు.