కరోనా ప్రభావం ప్రతి దేశాన్ని వెంటాడుతోంది. వైరస్ వల్ల ఆర్థిక నష్టమూ వాటిల్లుతోంది. అయితే కరోనా బాధితులకు సాయం కోసం విరాళాలు ప్రకటిస్తూ ముందుంటున్నారు సినీతారలు, క్రీడాకారులు. ఇదే విషయమై తాజాగా పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. భారత్-పాక్ మధ్య సిరీస్ నిర్వహించి వచ్చిన విరాళాలను రెండు దేశాలు సమానంగా తీసుకోవాలని సూచించాడు. దీనిపై భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌తో పాటు పాక్ మాజీ బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్ స్పందించారు.
"ఇప్పుడు డబ్బు కోసం పాకులాడటం సముచితం కాదు. అయినా భారత్‌కు ఆర్థిక స్థోమత ఉంది. కరోనా బాధితలకు అండగా బీసీసీఐ ఇప్పటికే ప్రభుత్వానికి 51 కోట్లు విరాళం ప్రకటించింది. అవసరమైతే మరింత ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు క్రికెట్ ద్వారా విరాళాలు సేకరించే అవసరం లేదు. అయినా మూడు మ్యాచ్‌ల ద్వారా ఎంత డబ్బు వస్తుంది. ఇంకో ఐదారు నెలల వరకు క్రికెట్ ప్రస్తావన తీయకపోవడమే మంచిది. పరిస్థితులు సద్దుమణిగాక ఆట ప్రారంభమవుతుంది. దేశం కంటే క్రికెట్ గొప్పది కాదు"