కరోనా టెస్టులో ప్రజలందరూ ఓపికగా ఆడి, వైరస్‌పై విజయం సాధించాలని టీమిండియా క్రికెటర్ హనుమ విహారి కోరుతున్నాడు. ఇన్నాళ్లుగా క్రికెట్ ప్రాక్టీస్, టూర్లు అంటూ ఖాళీ లేకుండా గడిపిన తాను.. అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్ని ఆస్వాదిస్తున్నానని చెబుతున్నాడు. కరోనా తగ్గిన తర్వాత కిక్రెట్‌లోనూ చాలా మార్పులొస్తాయంటున్నాడు. ఆటగాళ్లు పూర్వపు ఫామ్‌ను అందుకునేందుకు శ్రమించాల్సిందే అంటున్నాడు.
లాక్‌డౌన్‌ను ఎలా గడుపుతున్నారు? క్రికెట్‌కు సంబంధం లేకుండా ఇంట్లో కొత్త ప్రయోగాలేమైనా చేస్తున్నారా?
మ్యాచ్, టూర్స్ వల్ల ఎక్కువగా ఖాళీ సమయం ఉండేది కాదు. లాక్‌డౌన్‌తో ఎప్పుడూ లేనంతగా ఖాళీ సమయం దొరికింది. కుటుంబంతో ఇంత సమయం గడపడం ఇదే మొదటిసారి. ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టా. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నా. లాక్‌డౌన్ మొదటి రెండు వారాల పాటు బాగానే అనిపించింది. కానీ నెమ్మదిగా ఆటను మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ఇంట్లో కొత్త ప్రయోగాలేవి ఇప్పటి వరకు చేయలేదు. ఒకటి, రెండు సార్లు వంట చేశా అంతే. మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగించారు కదా.. పనులు నేర్చుకుంటా.
మీరు తక్కువ టెస్టులే ఆడినప్పటికీ చాలా అనుభవాలున్నాయి. క్రికెట్ అనగానే వెంటనే మీకు గుర్తొచ్చే జ్ఞాపకమేది?
క్రికెట్ అనగానే గుర్తొచ్చేదంటే నా చిన్నతనం. ఎందుకంటే అప్పుడు మ్యాచ్‌లు ఎక్కువగా చూసేవాడిని. అప్పుడే ఇష్టం పెరిగి ఆడాలని నిశ్చయించుకున్నా. ప్రస్తుతం అదే నా ప్రొఫెషన్ అయిపోయింది.