వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మొదటి టీ-ట్వంటీలో న్యూజిలాండ్ చేతిలో 80 పరుగుల తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది. కనీస పోరాటం లేకుండానే పెవిలియన్‌కు క్యూకట్టారు టీమిండియా బ్యాట్స్‌మెన్. న్యూజిలాండ్ జట్టులో సైఫర్డ్ బ్యాటింగే మ్యాచ్ మొత్తానికి ప్రధాన ఆకర్షణ.
సైఫర్డ్ వన్ మ్యాన్ షో..
కివీస్ బ్యాటింగ్‌లో ఓపెనింగ్ జోడీ చెలరేగింది. భారీ స్కోరుకు బాటలు వేసింది. ఓపెనర్‌గా వచ్చిన టిమ్ సైఫర్డ్ 84 పరుగులతో ఆకట్టుకున్నాడు. కివీస్ బ్యాటింగ్‌కు బలమైన పునాది వేశాడు. మన్రో, విలియమ్సన్ తలో 34 పరుగులు చేశారు.
భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. హార్దిక్ పాండ్యా మాత్రమే రెండు వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ 20 ఓవర్లో 219 పరుగులు చేసి టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
వన్డేలాడిన భారత జట్టేనా ఇది..!
విజయ పరంపర సాగిస్తూ వచ్చిన భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో గెలిచిన భారత జట్టు..అదే విశ్వాసంతో టీ-ట్వంటీకి సిద్ధమైంది. కానీ ఫలితం వేరేలా వచ్చింది. టాప్ ఆర్డర్ కుప్పకూలడం వల్ల మ్యాచ్ చేజారింది. భారత్ జట్టులో 39 పరుగులతో ధోని టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధావన్ 29 పరుగులు, విజయ్ శంకర్ 27 పరుగులు చేశారు.
న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, ఫెర్గ్యుసన్, శాంట్నర్, ఇష్ సోధి తలో రెండు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించారు.
న్యూజిలాండ్ గడ్డపై టీ-ట్వంటీ మ్యాచ్ గెలిచి రికార్డు సాధించాలన్న రోహిత్ కల నెరవేరలేదు.
ఒకే రోజు.. మహిళల జట్టు, పురుషుల జట్టు యాదృచ్ఛికంగా ఓటమి పాలయ్యాయి.
రెండో టీ-ట్వంటీ 8వ తేదీన అక్లాండ్లో జరగనుంది.