తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీసేన చెత్త రికార్డు.. అసలేమైంది వీరికి! - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో భారత ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రదర్శన అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. రెండో ఇన్నింగ్స్​లో కేవలం 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లీసేనపై విమర్శలు వస్తున్నాయి.

India collapse to 36-all out to record their lowest total in Test history
కోహ్లీసేన చెత్త రికార్డు.. అసలు ఏంటి కథ?

By

Published : Dec 19, 2020, 12:09 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో భారత జట్టు బ్యాటింగ్ తీరు అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయకపోవడంపై స్పందిస్తూ మరీ ఇంత చెత్త ప్రదర్శనా? అంటూ నెటిజన్లు ట్రోల్స్​తో ఆడేసుకుంటున్నారు. కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ కోహ్లీని విమర్శిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.

అత్యల్ప స్కోరు

ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్​లో 191 పరుగులకే ఆలౌట్ చేసింది భారత్. దీంతో టీమ్ఇండియా గెలుపు లాంఛనమే అనుకున్నారంతా. కానీ ఆ ఆనందం ఒక్కపూటలోనే మాయమైంది. రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీసేన కేవలం 36 పరుగులకే కుప్పకూలింది. దీంతో టెస్టు చరిత్రలో తమ అత్యల్ప స్కోర్​ను నమోదు చేసింది.

రెండంకెల స్కోరేది!

కోహ్లీ, పుజారా, రహానే, విహారీ లాంటి మన్నికైన ఆటగాళ్లతో పాటు మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలతో యువ ఆటగాళ్లూ జట్టులో ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్ నమోదు చేయలేకపోయారు. క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టుగా పెవిలియన్ బాట పట్టారు. ఆసీస్ బౌలర్ల దాటికి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మొత్తంగా మన ఆటగాళ్ల స్కోర్లు చూసుకుంటే .. పృథ్వీ షా (4), మయాంక్ అగర్వాల్ (9), పుజారా (0), కోహ్లీ (4), రహానే (0), విహారీ (8), సాహా (4).. ఇలా ఉన్నాయి.

దెయ్యం పట్టిందా?

టీమ్ఇండియా బ్యాటింగ్ తీరు క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేసిందనడంలో సందేహం లేదు. ఆధునిక క్రికెట్ చరిత్రలో గొప్ప జట్టుగా వెలుగులీలుతున్న ఈ సమయంలో కోహ్లీసేన నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవ్వరూ ఊహించి ఉండరు. 'అదేదో దెయ్యం పట్టినట్లు అలా ఆడుతున్నారేంటి?' భారత జట్టు బ్యాటింగ్ తీరు చూసి సగటు అభిమానుల మదిలో మెదిలిన ప్రశ్న ఇది.

ఆస్ట్రేలియా సంబరం

ఎక్కడ లోపం?

అసలే ఆస్ట్రేలియా పిచ్​లు. అందులోనూ డే నైట్ టెస్టు. ఐపీఎల్​లో బంతుల్ని బాది బాది అలవాటు పడ్డ ప్రాణం. పింక్ బాల్​తో అంతగా ప్రాక్టీస్​తో పాటు ఎక్కువ మ్యాచ్​లు ఆడిన అనుభవం లేకపోవడం. ఇదంతా భారత్​కు అడ్డంకిగా మారిందా? అంటే అవుననే చెప్పొచ్చు. కానీ గత సిరీస్​లో ఆసీస్​ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచామన్న విశ్వాసం మరోవైపు. దీంతో కోహ్లీసేనపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ ఈ టెస్టులో భారత బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టులోని లోపాలు మరోసారి తేటతెల్లమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details