తెలంగాణ

telangana

ETV Bharat / sports

2023 వరల్డ్​కప్​ నాటికి రెండు ఫార్మాట్లకే కోహ్లీ?

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ తన కెప్టెన్సీపై అనూహ్య ప్రకటన చేశాడు. జట్టును నడిపించే బాధ్యత అంత సులభమైనది కాదని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ఒక ఫార్మాట్​కు త్వరలో గుడ్​బై కూడా చెప్తానని వెల్లడించాడు.

Virat Kohli news
వచ్చే వరల్డ్​కప్​ నాటికి రెండు ఫార్మాట్లకే కోహ్లీ?

By

Published : Feb 19, 2020, 1:54 PM IST

Updated : Mar 1, 2020, 8:17 PM IST

భారత జట్టు కెప్టెన్​, పరుగుల రారాజు విరాట్​ కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మరో మూడేళ్ల వరకు అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌ ఆడతానని వెల్లడించిన విరాట్​... ఆ తర్వాత పరిస్థితులు భిన్నంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. శుక్రవారం నుంచి భారత×న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 2021 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఏదైనా ఫార్మాట్ నుంచి తప్పుకుంటారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు కోహ్లీ సమాధానమిచ్చాడు.

"నా ఆలోచనా ధోరణి వేరేగా ఉంది. ఇప్పట్నుంచి కఠినమైనా మరో మూడేళ్ల వరకు ఆడటానికి నేను సన్నద్ధమవుతున్నాను. ఆ తర్వాత మన సంభాషణ వేరే విధంగా ఉంటుంది. గత ఎనిమిదేళ్లుగా ఏడాదికి 300 రోజులు క్రికెట్‌ ఆడుతున్నాను. దీనిలో ప్రయాణాలు, ప్రాక్టీస్‌ సెషన్‌లు కూడా ఉన్నాయి. ఇది తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అయితే ఆటగాళ్లు దాని గురించి ఆలోచించడం లేదని కాదు. తీరికలేని షెడ్యూల్‌లో కూడా వ్యక్తిగతంగా మేం విరామం తీసుకుంటున్నాం. ముఖ్యంగా అన్ని ఫార్మాట్లలో ఆడే వాళ్లం. అయితే సారథిగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువైన విషయం కాదు. ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా దీని ప్రభావం ఉంటుంది. అయితే విరామాలు తీసుకుంటూ వీటిని అధిగమిస్తున్నాను"

--విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి

"34-35 ఏళ్లలో నా శరీరం అధిక పని భారాన్ని తట్టుకోలేదు. కానీ వచ్చే రెండు, మూడేళ్ల వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వచ్చే మూడేళ్లలో జట్టుకు నా సహకారం ఎంతో అవసరమని తెలుసు. ఎటువంటి నిర్ణయాలనైనా ఆ తర్వాతే తీసుకుంటా. నా దృష్టిలో ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నమెంట్లలో టెస్టు ఛాంపియన్‌షిప్‌దే అత్యున్నత స్థాయి. అందుకే అన్ని జట్లు లార్డ్స్‌లో జరగనున్న ఫైనల్స్‌లో ఆడాలని ప్రయత్నిస్తాయి. ఇతరులకు మేం భిన్నమేమి కాదు. ఫైనల్లో ఆడాలని భావిస్తున్నాం" అని కోహ్లీ పేర్కొన్నాడు.

విరాట్​ కోహ్లీ

విరాట్​ వ్యాఖ్యల ఆధారంగా 2023 ప్రపంచకప్​ నాటికి కొత్త సారథి వస్తారని పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ పరుగుల వీరుడు మాత్రం టీ20లకే గుడ్​బై చెప్పొచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Mar 1, 2020, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details