ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే తొలి రెండు మ్యాచ్‌ల కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. పితృత్వ సెలవుల కారణంగా ఆసీస్‌తో చివరి మూడు టెస్టులకు దూరమైన కోహ్లీ.. తిరిగి జట్టులోకి వచ్చాడు. హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ కూడా పునరాగమనం చేశారు.
ఆసీస్ పర్యటనలో ఉన్నవారే దాదాపుగా ఈ సిరీస్ ఆడనున్నారు. అయితే చివరి టెస్టు మాత్రమే ఆడిన నటరాజన్‌కు ఇందులో అవకాశం లభించలేదు. భువనేశ్వర్ కుమార్ కూడా ప్రకటించిన జట్టులో లేకపోవడం అభిమానుల్ని నిరాశపరిచింది.