అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ విమర్శలు సంధించాడు. అత్యంత చెత్తగా ర్యాంకింగ్స్ ప్రకటించారని అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సరైన ప్రదర్శన చేయనప్పటికీ ఆ జట్లు రెండు, నాలుగు స్థానాల్లో ఉండటమేంటో అర్థం కావట్లేదని అన్నాడు.
"ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌పై నిజాయితీగా మాట్లాడలనుకుంటున్నా. అత్యంత చెత్తగా ర్యాంకింగ్స్‌ను ఇచ్చారు. గత రెండేళ్లుగా టెస్టుల్లో న్యూజిలాండ్ ఏ మేరకు రాణించిందో నాకు అర్థం కావట్లేదు. మొన్నటివరకు ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు నాలుగో ర్యాంకుకు దిగజారింది. మూడేళ్లుగా ఇంగ్లీష్ జట్టు.. టెస్టుల్లో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విదేశాల్లో ఆ జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. స్వదేశంలో ఒకే ఒక్క సిరీస్ నెగ్గింది. యాషెస్ సిరీస్‌లోనూ డ్రాతో సరిపెట్టుకుంది. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపైనే వారు గెలిచారు" -మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
ఈ ర్యాంకింగ్స్ ప్రకటించడం చూసి తనకు అయోమయంగా అనిపించిందని అన్నాడు వాన్
"నా అభిప్రాయం ప్రకారం న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉండే అంత పటిష్ఠ జట్టు కాదు. ఆస్ట్రేలియా ఆ స్థానానికి తగిన జట్టు. ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం చూసి నాకు అయోమయంగా అనిపించింది." - మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్