భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 చాలాకాలం గుర్తుండిపోతుంది. ఆఖరి ఓవర్లో షమి 9 పరుగులు చేయకుండా కివీస్‌ను అడ్డుకున్నాడు. జోరు మీదున్న కేన్ విలియమ్సన్ (95), సీనియర్ ఆటగాడు రాస్ టేలర్‌ను పెవిలియన్ పంపించాడు. ఫలితంగా మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లోనూ అదే నాటకీయత కనిపించింది. బుమ్రా ప్రభావం చూపుతాడనుకుంటే విలియమ్సన్ ఓ సిక్సర్, బౌండరీ బాదాడు. ఆఖరి బంతికి గప్తిల్ బౌండరీ సాధించడం వల్ల టీమిండియా లక్ష్యం 18 పరుగులుగా మారింది.
భారత ఛేదనైతే సులభంగా ఏమీ సాగలేదు. సౌథీ పదునైన యార్కర్లు విసిరాడు. తొలి బంతికి రోహిత్ 2 పరుగులు తీశాడు. రనౌట్ ప్రమాదం తప్పించుకున్నాడు. రెండో బంతికి ఒక పరుగే వచ్చింది. మూడో బంతిని ఆఫ్‌సైడ్ జరిగిన రాహుల్ బౌండరీ బాదాడు. అప్పుడు స్కోరు 7/0. రాహుల్ భారీ షాట్‌కు ప్రయత్నిద్దామనుకున్నా సౌథీ యార్కర్‌తో సింగిల్ మాత్రమే వచ్చింది. ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు చేస్తేనే విజయం. అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. కొడతాడా? కొట్టడా?డగౌట్లో భారత్, కివీస్ ఆటగాళ్లలోనూ ఆందోళన. యార్కర్‌గా వేసిన ఐదో బంతిని రోహిత్ భారీ ఎత్తులోంచి సిక్సర్‌గా మలిచాడు. సౌథీ ఏ బంతి వేస్తాడో తెలియదు. 4 పరుగులు కావాలి. అనూహ్యంగా అతడు మళ్లీ యార్కర్ విసరడం.. హిట్‌మ్యాన్ ఫ్లడ్‌లైట్ల ఎత్తుకు బంతిని బాదడం.. కోహ్లీ సహా కుర్రాళ్లు మైదానంలోకి పరుగెత్తడం.. కివీస్ ఆటగాళ్ల గుండె మరోసారి పగలడం.. క్షణాల్లో జరిగిపోయింది.