న్యూజిలాండ్‌తో మరో కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. నేడు(శనివారం) కివీస్‌తో రెండో వన్డేలో కోహ్లీ సేన తలపడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన భారత్.... ఈ మ్యాచ్‌లో గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కానుందీ మ్యాచ్.
తొలి వన్డేలో జరిగిన బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలు పునరావృతం కాకుండా చూడాలని భారత్ భావిస్తోంది. తొలి వన్డేలో భారత్‌ను చిత్తు చేసిన కివీస్.. అదే జోరు కొనసాగించాలన్న లక్ష్యంతో బరిలో దిగుతోంది.
బ్యాటింగ్ అదరగొట్టాలి!
ఈ మ్యాచ్‌లోని బ్యాటింగ్‌లో భారత్‌కు పెద్దగా సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదు. తొలి వన్డేలో పర్వాలేదనించిన పృధ్వీ షా- మయాంక్ అగర్వాల్ ఈరోజూ బ్యాటింగ్ దాడిని ఆరంభించనున్నారు. కోహ్లీ, రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌లో, తన వన్డే కెరీర్లో తొలి సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్‌ను కొనసాగించాలని చూస్తున్నాడు.
కలవరపెడుతున్న ఫీల్డింగ్
కోహ్లీ సేనను బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలు ఆందోళన రేపుతున్నాయి. మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం.. భారత్‌కు ప్రతికూల అంశంగా మారుతోంది. తొలి వన్డేలో టీమిండియా.. 24 వైడ్లు సహా మొత్తం 29 అదనపు పరుగులు ఇవ్వడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది.