ఇంగ్లాండ్‌తో అయిదు టీ20ల సిరీస్‌ను ఓటమితో మొదలెట్టిన టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లో ఘన విజయంతో లెక్క సరి చేసింది. ఇప్పుడిక ఇదే జోరును కొనసాగించి ఆధిపత్యం చెలాయించేందుకు సమయం ఆసన్నమైంది. మంగళవారం జరిగే మూడో టీ20లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించేందుకు భారత జట్టు సిద్ధమైంది. బౌలర్లు లయ అందుకోవడం, కెప్టెన్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం వల్ల పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆతిథ్య జట్టును ఇంగ్లాండ్ ఆపగలదా? ఓటమి ఒత్తిడి నుంచి బయటపడి పోటీనివ్వగలదా? అన్నది ఆసక్తికరం. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ ఆడే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.
మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియం మళ్లీ పరుగుల విందుకు సిద్ధమైంది. సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే మూడో టీ20లో నెగ్గడం రెండు జట్లకు కీలకం కాబట్టి టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడడం ఖాయం. తొలి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో విఫలమై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిన భారత్.. రెండో మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకుని ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. ఈ విజయం ఇచ్చిన ఊపులో మరోసారి ప్రత్యర్థిని చిత్తుచేసి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సంపాదించే వీలుంటుంది. దీంతో చివరి రెండు టీ20ల్లో ఏ ఒక్కటి నెగ్గినా సిరీస్ సొంతం అవుతుంది. లేని పక్షంలో వరుసగా చివరి రెండు టీ20ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా జట్టు బరిలో దిగనుంది.
రోహిత్ రాక?
మూడో టీ20కి తుది జట్టు ఎంపికలో ఓ మార్పు జరిగే వీలుంది. తొలి రెండు టీ20లకు ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చామని కోహ్లి చెప్పిన నేపథ్యంలో.. మూడో మ్యాచ్‌కు అతను కచ్చితంగా జట్టులోకి వచ్చే అవకాశముంది. రెండు మ్యాచ్‌ల్లోనూ వరుసగా 1, 0 పరుగులు చేసి నిరాశపర్చిన కేఎల్ రాహుల్ స్థానంలో రోహిత్ ఆడే వీలుంది. అలాగే అరంగేట్ర మ్యాచ్‌లోనే ధనాధన్ అర్ధశతకంతో సత్తాచాటి జట్టు విజయానికి బాటలు వేసిన ఇషాన్ కిషాన్‌ను తప్పించే పరిస్థితి లేదు కాబట్టి రాహుల్ దూరమవ్వక తప్పదు. రోహిత్ రాకతో భారత బ్యాటింగ్ మరింత బలంగా మారనుంది. చాలా కాలం తర్వాత కెప్టెన్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చి అజేయంగా నిలిచి రెండో టీ20లో జట్టును విజయతీరాలకు చేర్చడం శుభపరిణామం. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న పంత్ మంచి ఆరంభాలను భారీస్కోర్లుగా మలచాల్సి ఉంది. శ్రేయస్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌తో బ్యాటింగ్ పటిష్ఠంగా ఉంది. అరంగేట్ర మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాని సూర్యకు ఈ మ్యాచ్‌లోనైనా క్రీజులో అడుగుపెట్టే ఛాన్స్ దొరకుతుందేమో చూడాలి.