నాలుగో టీ20లో ఇంగ్లాండ్ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్ఇండియా. కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రంలోనే చెలరేగాడు. అర్ధశతకానికి(57) తోడు ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(37) మెరిశాడు. ఉన్నంతసేపు రిషభ్ పంత్(30) కూడా ధాటిగానే ఆడాడు. ఓపెనర్లు మాత్రం మరోసారి విఫలమయ్యారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లతో టీమ్ఇండియాను దెబ్బతీశాడు. ఆదిల్, స్టోక్స్, సామ్ కరన్, వుడ్ తలో వికెట్ తీశారు.
సూర్య మెరుపులు..
వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు సూర్యకుమార్. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో మురిపించాడు. 3 సిక్సర్లు, 4 ఫోర్లతో ధనాధన్ అర్ధశతకం(57) సాధించాడు. అయితే 14వ ఓవర్లో సామ్ కరన్ బౌలింగ్‌లో మరో షాట్‌కు ప్రయత్నించిన అతడు మలన్‌కు దొరికిపోయాడు.