అహ్మదాబాద్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు అనంతరం పిచ్‌పై విమర్శలు ప్రతివిమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్ మాజీ బౌలర్ మాంటీ పనేసర్ మొతేరా వికెట్‌పై స్పందించాడు. నాలుగో టెస్టుకు కూడా ఇదే తరహా పిచ్ ఉంటే.. టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లలో ఐసీసీ కోత విధించాలని కోరాడు.
"మేం గతంలో క్లబ్ క్రికెట్ ఆడిన వికెట్‌ను తలపిస్తుంది మొతేరా పిచ్. 100 పరుగులకు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసేవాళ్లం. ఆ చిన్న మొత్తాన్ని కూడా ఛేదించలేకపోయేవాళ్లం. ఎందుకంటే అది టర్నింగ్ పిచ్. ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేరొందిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ తరహా వికెట్‌ను తయారు చేశారు. కేవలం రెండ్రోజుల్లోనే ఆట ముగిసింది." అని పనేసర్ పేర్కొన్నాడు.
పింక్ టెస్ట్ కాబట్టే..
పింక్ టెస్టు వికెట్ గురించి ఐసీసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు మాంటీ. "నాకు తెలిసి తర్వాత టెస్టుకు కూడా ఇదే వికెట్ ఉంటుంది. అదే కనుక నిజమైతే.. టీమ్ఇండియా డబ్ల్యూటీసీ పాయింట్లలో ఐసీసీ కోత విధించాలి. ఈ టెస్టుకు ముందు వరకు చెన్నై పిచ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు మొతేరా వికెట్‌పై చర్చ నడుస్తోంది. ఇది చెపాక్ పిచ్ కంటే ఘోరంగా ఉంది." అని పనేసర్ అభిప్రాయపడ్డాడు.
ఇది పింక్ బాల్ టెస్టు కాబట్టి ఐసీసీ.. దీనిని పరిగణనలోకి తీసుకోకపోవచ్చని మాంటీ అన్నాడు. గులాబీ బంతిని నెమ్మదిగా బౌలింగ్ చేస్తే అది ఉపరితలంపై వేగంగా వెళ్తుందనేది ప్రస్తుత వాదన.. అయితే తర్వాతి మ్యాచ్ ఎరుపు బంతితో జరుగుతుందని పనేసర్ తెలిపాడు. అప్పుడు కూడా వికెట్ ఇలాగే ఉంటే పాయింట్లలో కోత విధించాలని అతడు కోరాడు. కనీసం మూడు నుంచి మూడున్నర రోజులు అయినా టెస్టు మ్యాచ్ జరిగేలా పిచ్‌ను తయారు చేయాలన్నాడు.
ఇదీ చదవండి:శ్రీలంక క్రికెట్ బోర్డు డైరెక్టర్‌గా టామ్ మూడీ