టీమ్ఇండియాతో సిరీస్ కఠిన సవాలు లాంటిదని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్. ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో భారత్‌పై గెలిస్తే తమలో ఆత్మవిశ్వాసం తారస్థాయికి చేరుకుంటుందని అన్నాడు.
"ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత భారత జట్టును ఓడించడం ఎంతో కష్టం అని అర్థమైంది. కాబట్టి టీమ్ఇండియాతో తలపడటం గొప్ప సవాల్. మేము వారిపై పైచేయి సాధిస్తామా అని ఆలోచిస్తే? అవును. గెలుస్తామనే భావనలో ఉంటాను. ఎందుకంటే నేనెప్పుడు సానుకూల దృక్పథంతోనే ఉంటాను. కానీ ఈ పోరు ఎంతో కఠినమైనదని తెలుసు. ఒకవేళ ఈ సిరీస్‌లో గెలిస్తే మాలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఆతిథ్య జట్టులో గొప్ప ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉండటం, సొంత గడ్డపై ఆడటం.. ఇలా ప్రతీది పరిస్థితులు వారికి అనుకూలించవచ్చు. అయితే మా జట్టు కూడా క్రమక్రమంగా ఎదుగుతోంది. బాగా రాణిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇరు జట్లు మధ్య పోరు ఎంతో ఆసక్తికరమైనది. ఈ పెద్ద సవాలను సగౌరవంగా స్వీకరిస్తాం."
-సిల్వర్‌వుడ్, ఇంగ్లాండ్ హెడ్ కోచ్.
టీమ్ఇండియాతో తొలి రెండు టెస్టులకు విశ్రాంతి పేరిట ఇంగ్లాండ్ క్రికెటర్ బెయిర్ స్టోను పక్కన పెట్టింది ఆ దేశ బోర్డు. జాస్ బట్లర్ తొలి టెస్టు తర్వాత తమ స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. అయితే ఈ విషయాల కారణంగా బోర్డుపై మాజీల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలా రొటేషన్ పద్దతిలో ఆటగాళ్లను ఆడించడం సరికాదని అంటున్నారు. సాధ్యమైనంత వరకు ఉత్తమమైన జట్టును ఎంపిక చేయాలని అభిప్రాయపడుతున్నారు.
దీని గురించి మాట్లాడిన సిల్వర్‌వుడ్.. "చాలా కాలంపాటు ఆటగాళ్లు హోటల్స్, బయోబబుల్‌లోనే గడుపుతున్నారు. అది అంతా సులువు కాదు. కుటుంబంతో గడపడానికి వారికి కాస్త సమయం ఇవ్వాలి. కాబట్టి రొటేషన్ పద్ధతి నేను ఏకీభవిస్తున్నాను. అయితే బెయిర్‌స్టో మాత్రం మూడో టెస్టు నుంచి అందుబాటులో కచ్చితంగా ఉంటాడని చెప్పలేను. కానీ అతడికి ప్రస్తుతం విశ్రాంతి ఇవ్వడం సరైనదే అని నా అభిప్రాయం. ఎందకంటే అతడు అన్ని ఫార్మాట్లలో తీరిక లేకుండా ఆడుతుంటాడు. అందుకే తన కుటుంబంతో కలిసి సంతోషంగా గడపటానికి కాస్త సమయాన్ని ఇచ్చాం. అతడి ఆటతీరు చాలా బాగుంటుంది." అని అన్నాడు.
ఇటీవలే శ్రీలంకపై 2-0తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవడం సహా వైట్‌వాష్ చేసింది ఇంగ్లాండ్. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. రూట్ సేన మంచి ఫామ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య సిరీస్ అభిమానుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కాగా, భారత పర్యటనలో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది ఇంగ్లీష్ జట్టు. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. తర్వాత టీ20 పోరు కోసం సిద్ధమవనున్నాయి ఇరుజట్లు. 28న జరిగే వన్డేతో ఇంగ్లాండ్ పర్యటన పూర్తి కానుంది.
ఇదీ చూడండి : భారత్Xఇంగ్లాండ్: చెన్నైలో ఆధిపత్యం ఎవరిదంటే?