భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టుదలతో బ్యాటింగ్ చేస్తోంది. తొలి సెషన్‌లో వర్షం అంతరాయం కారణంగా సుమారు నాలుగు గంటల పాటు ఆటకు అంతరాయం కలగడం వల్ల మొదటి రోజు 55 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మొత్తంగా ఈరోజు 55 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది ఆసీస్.
ఆదిలోనే వికెట్
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే స్టార్ ఓపెనర్ వార్నర్ (5) వికెట్ కోల్పోయింది ఆసీస్. గత నాలుగేళ్లలో స్వదేశంలో 10 పరుగుల లోపు ఔటవడం వార్నర్‌కు ఇదే మొదటిసారి. తర్వాత మరో ఓపెనర్ పకోస్కీ అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ధశతకం (62*; 110 బంతుల్లో 4x4) బాదాడు. ఇతడికి తోడు లబుషేన్ కూడా సత్తాచాటడం వల్ల రెండో వికెట్‌కు వీరిద్దరూ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం పకోస్కీని పెవిలియన్ చేర్చి టెస్టుల్లో మొదటి వికెట్ సాధించాడు సైనీ.
లబుషేన్, స్మిత్ దూకుడు
పుకోవ్ స్కీ ఔటైనా.. లబుషేన్ దూకుడు కొనసాగించాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇతడికి తోడు క్రీజలోకి వచ్చిన స్మిత్ కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన ఈ ఆటగాడు తన ఫామ్‌ను నిరూపించుకుంటూ అద్భుత బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ ఆట ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఫలితంగా మొదటి రోజు ఆటముగిసే సమయానికి లబుషేన్ (67), స్మిత్ (31) పరుగులతో క్రీజులో ఉన్నారు.