మహ్మద్ సిరాజ్.. టీమ్ఇండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఇతడు బంతితో ఔరా అనిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో షమీ గాయపడగా.. రెండో మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న సిరాజ్ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అలాగే మూడో టెస్టులోనూ రెండు వికెట్లు తీశాడు. తాజాగా జరుగుతోన్న చివరిదైన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు వికెట్లతో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ దక్కించుకుని మొత్తం 13 వికెట్లతో ఈ టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు (13) దక్కించుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ క్రికెట్ ప్రయాణంపై ప్రత్యేక కథనం.
క్రికెటే లోకం..
హైదరాబాద్ బంజారాహిల్స్ ఖాజానగర్‌లో ఓ నిరుపేద కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి రోజూ వారి కూలీ. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన మహ్మద్ సిరాజ్‌కు క్రికెటే లోకమైంది. సిరాజ్ ఉత్సాహానికి తండ్రి ప్రోత్సాహం అందడం వల్ల ముందుకెళ్లాడు. మెరుపు వేగంతో బంతులు వేస్తూ గల్లీ క్రికెట్‌లో.. స్థానిక టోర్నీల్లో హీరోగా మారిపోయాడు. 2015 వరకూ టెన్నిస్ బంతితోనే ఆడిన సిరాజ్ స్నేహితుడి సలహాతో క్రికెట్ బంతి అందుకున్నాడు. సిరాజ్ ప్రతిభ చూసిన హైదరాబాద్ మాజీ ఓపెనర్ అబ్దుల్ అజీమ్ అతనికి హెచ్‌సీఏ లీగ్‌లో ఆడే అవకాశం కల్పించాడు. అలా క్లబ్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఏడాది తిరక్కుండానే హైదరాబాద్ అండర్-23 జట్టులోకి, తర్వాత సీనియర్ టీమ్‌లోకి వచ్చేశాడు.
తండ్రి మరణించినా!
ఐపీఎల్‌లో మెరుపులతో సిరాజ్ అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే అక్కడికెళ్లాక అతడి తండ్రి మరణించాడన్న వార్త విన్నాడు. ఆ సమయంలో.. భారత్‌కు తిరిగి వచ్చేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తామన్నా అతడు నిరాకరించాడు. భారత్‌కు వెళ్లి వస్తే క్వారంటైన్ ఇబ్బందులుంటాయన్న ఉద్దేశంతో అక్కడే ఆగిపోయాడు. తండ్రి కోరుకున్నట్టుగా దేశానికి సేవ చేయడమే ప్రధానమని నిశ్చయించుకున్నాడు.