1988 తర్వాత బ్రిస్బేన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడని ఆస్ట్రేలియాకు టీమ్ఇండియా ఓటమి రుచి చూపించింది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని సాధించి.. సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. బోర్డర్-గావస్కర్ సిరీస్ ట్రోఫీని చేజారనివ్వకుండా తమ వద్దే ఉంచుకుంది.
నాలుగో ఇన్నింగ్స్‌లో 328 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ గిల్ (91) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు పుజారా (56) అర్ధశతకంతో రాణించాడు. చివర్లో పంత్ (89) తనదైన శైలి దూకుడు బ్యాటింగ్‌తో భారత్‌కు మరపురాని విజయాన్ని అందించాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్(4), లైయన్ (2), హేజిల్‌వుడ్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.
టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన పంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు దక్కింది. ప్యాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
నెమ్మదిగా ఆడినా..
4/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం ఐదోరోజు ఆట కొనసాగించిన టీమ్ఇండియా ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ(7) వికెట్ కోల్పోయింది. అనంతరం శుభ్‌మన్ గిల్(91;146 బంతుల్లో 8x4,2x6), పుజారా(56; 211 బంతుల్లో 7x4) జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు. అప్పటికి టీమ్ఇండియా స్కోర్ 83/1గా నమోదైంది. భోజన విరామం తర్వాత ధాటిగా ఆడిన గిల్ శతకానికి చేరవలో ఉండగా లైయన్ బౌలింగ్‌లో స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో 114 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే కెప్టెన్ అజింక్య రహానె(24) పెవిలియన్ చేరాడు. కమిన్స్ బౌలింగ్‌లో పైన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆపై రెండో సెషన్ పూర్తయ్యే సమయానికి భారత్ 183/3తో నిలిచింది.
పంత్, సుందర్ మెరుపులు..
మూడో సెషన్లో టీమ్ఇండియా విజయానికి 144 పరుగులు చేయాల్సి ఉండడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అంతా అనుకున్నారు. పుజారా, పంత్ ఆ విధంగానే ఆడారు. వారిద్దరూ వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే, జట్టు స్కోర్ 228 పరుగుల వద్ద పుజారా నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే మయాంక్ అగర్వాల్ (9) స్వల్ప స్కోరుకు పెవిలియన్ చేరాడు. అప్పటికి టీమ్ఇండియా 265/5 స్కోర్‌తో నిలిచింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
భారత్ విజయానికి 62 పరుగులు అవసరమైన వేళ పంత్‌తో జోడీకట్టిన వాషింగ్టన్ సుందర్(22; 29 బంతుల్లో 2x4,1x6) ధాటిగా ఆడాడు. పంత్ సైతం బౌండరీలు బాదడంతో టీమ్ఇండియా విజయానికి చేరువైంది. ఈ క్రమంలోనే సుందర్, శార్దుల్ ఠాకూర్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అప్పటికే భారత్ గెలుపు ఖాయమైంది. హేజిల్‌వుడ్ వేసిన 97వ ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టిన పంత్ భారత్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు.
తొలి ఇన్నింగ్స్ సాగిందిలా..
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. లబుషేన్(108) సెంచరీకి తోడు టిమ్ పైన్(50), గ్రీన్(47) రాణించడం వల్ల ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. నటరాజన్, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ ముగ్గురూ మూడేసి వికెట్లు తీయగా, సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. శార్దుల్ ఠాకూర్(67), వాషింగ్టన్ సుందర్(62) అర్ధసెంచరీలతో రాణించారు. రోహిత్ శర్మ 44 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్(5), స్టార్క్(2), కమిన్స్(2), లయన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని టీమ్ఇండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్ స్మిత్ (55), వార్నర్ (48) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో సిరాజ్(5), ఠాకూర్(4), సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.