ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభమైంది. ముంబయి వేదికగా జరుగుతోన్న మొదటి మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ పడిలేస్తూ పరుగులు సాధించారు. శిఖర్ ధావన్ (74) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద రోహిత్ శర్మ.. 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు ధావన్. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ చేశాడు.
30 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు
మూడు పరుగుల చేస్తే అర్ధసెంచరీ పూర్తవుతుందన్న దశలో కేఎల్ రాహుల్ (47) పెవిలియన్ చేరాడు. 74 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసి గబ్బర్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. మరో 16 పరుగులు చేశాక 156 పరుగుల వద్ద కెప్టెన్ కోహ్లీ (16) ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఔటై నిరాశపరిచాడు. మరో 12 పరుగుల తేడాలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (4) పెవిలియన్ చేరి టీమిండియా శిబిరంలో ఆందోళన నింపాడు. ఫలితంగా 30 పరుగుల తేడాలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది కోహ్లీసేన.