టీమ్ఇండియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లు అదరగొడుతున్నారు. నాలుగో రోజు ఆటలో తొలి సెషన్ పూర్తయ్యేసరికి ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
గబ్బా టెస్టు: 182 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ - భారత్ ఆసీస్ బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్
టీమ్ఇండియాతో జరుగుతున్న నాలుగో(చివరి) టెస్టు నాలుగో రోజు ఆటలో భోజన విరామ సమయానికి ఆసీస్ 182 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(28), గ్రీన్(4) ఉన్నారు.
ఓవర్ నైట్ స్కోరు 21/0తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ ఓపెనర్లు.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. దాదాపు 20 ఓవర్లు వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆసీస్ వరుసగా వికెట్లను కోల్పోయింది. 26వ ఓవర్‌లో 89 పరుగుల వద్ద శార్దుల్ బౌలింగ్‌లో ఓపెనర్ హ్యారిస్(38) వికెట్ కీపర్ పంత్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఓవర్లోనే అర్ధశతకానికి చేరువవుతున్న వార్నర్(48)ను సుందర్ బోల్తాకొట్టించాడు. వార్నర్ సమీక్షకు వెళ్లినా ఔట్ అనే తేలింది. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
అనంతరం 31వ ఓవర్‌లో సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. మూడో బంతికి లబుషేన్(25)ను పెవిలియన్‌కు చేర్చిన సిరాజ్.. ఆఖరి బంతికి మాథ్యూ వేడ్(0)ను ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో స్మిత్ (28), గ్రీన్ (4) ఉన్నారు. ఫలితంగా భారత్ కన్నా ఆసీస్ 182 పరుగుల ఆధిక్యంలో ఉంది.