ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన వన్డే సిరీస్లో కొద్దిలో వైట్ వాష్ నుంచి తప్పించుకున్న టీమ్ఇండియా ప్రస్తుతం టీ20 సిరీస్పై కన్నేసింది. వన్డేల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. అయితే వన్డే సిరీస్లో ఓడినందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడి కొంచెం ఎక్కువగానే ఉంది. మొదటి రెండు వన్డేల్లో ఓటమితో విమర్శల పాలైన కోహ్లీ.. టీ20 సిరీస్లో గెలుపుతో తన కెప్టెన్సీ సత్తాను చూపించాలని తహతహలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో టీ20ల్లో కోహ్లీ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉందో తెలుసుకుందాం.
గెలుపు-ఓటములు
విరాట్ ఇప్పటివరకు 37 టీ20ల్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇందులో భారత్ 24 మ్యాచ్లు గెలవగా 11 ఓడిపోయింది. రెండు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. టీ20ల్లో కోహ్లీ విజయ శాతం 64.86తో మెరుగ్గా ఉంది. అలాగే ఈ 37 మ్యాచ్ల్లో బ్యాట్స్మన్గా కోహ్లీ 43.73 సగటుతో 1137 పరుగులు చేశాడు.