టీమ్ఇండియాతో చివరి వన్డేలో ఆ జట్టు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తనతో చెప్పిన మాటలు ఎప్పటికీ మరచిపోనని ఆస్ట్రేలియా యువ క్రికెటర్ కామెరూన్ గ్రీన్ అన్నాడు. బ్యాటింగ్లో కొంత ఒత్తిడికి లోనవుతున్న సమయంలో తనలోని విశ్వాసం నింపాడని చెప్పాడు. ఈ విషయాన్ని తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.
"నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ స్టంప్స్ వెనుక ఉన్నాడు. నాలో ఒత్తిడి గమనించి 'ఒత్తిడితో ఉన్నావా'? అని అడిగినట్లు అనిపించింది. 'అవును, కొంచెం ఒత్తిడిగా భావిస్తున్నా' అని సమాధానమిచ్చా. 'మరేం పర్వాలేదు.. బాగా ఆడు' అనే విధంగా ఏదో చెప్పి నాలో ఉత్సాహం నింపాడు. అంతకుముందు బౌలింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ నాతో ఏదో అనాలని ప్రయత్నించాడు. అప్పుడు ఫించ్ కలుగజేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాలను నేనెప్పటికీ మర్చిపోలేను"