వ్యక్తిగత ప్రదర్శనల కోసం ఎప్పుడూ ఆడనని, జట్టు విజయాల కోసమే పోరాడతానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆ ఆలోచనే తాను నిలకడగా పరుగులు సాధించేలా చేస్తుందని తెలిపాడు. ఐసీసీ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో కోహ్లీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ప్లేయర్, 'వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్' అవార్డులు దక్కించుకున్నాడు. దీనిపై కోహ్లీ మాట్లాడాడు.
"వ్యక్తిగత ప్రదర్శనల కోసం ఆడితే నిలకడగా పరుగులు సాధించలేరు. అదే జట్టు విజయం కోసం మైదానంలో అడుగుపెడితే సామర్థ్యానికి మించి గొప్ప ప్రదర్శన చేస్తారు. అదే అన్ని ఫార్మాట్లలో మీరు నిలకడగా ఆడేలా చేస్తుంది. 40, 50, 60 పరుగులు సాధించారా? లేదా? సెంచరీ, డబుల్ సెంచరీ చేశారా? అనేది ముఖ్యం కాదు. జట్టు గెలుపు కోసం ఎంతలా ప్రయత్నించారనేది కీలకం. నా ఆలోచన ధోరణి ఎప్పుడు ఇలానే ఉంటుంది. వీలైనంత సేపు బ్యాటింగ్ చేస్తూ జట్టును పటిష్ఠ స్థితిలో ఉంచడానికి ప్రయత్నిస్తా. మూడు ఫార్మాట్లలో సత్తాచాటడం సవాలే. అయితే నేను ఆటలో ప్రాథమిక అంశాలను పాటిస్తాను. చక్కని క్రికెటింగ్ షాట్లు ఆడటం, వాటిని మెరుగుపర్చుకోవడం చేస్తాను. అన్ని ఫార్మాట్లలో ఇదే అనుసరిస్తాను. ఫార్మాట్లను బట్టి గేర్ మార్చడానికి ఇది ఎంతో దోహదపడుతుంది".
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్