వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఎంపిక చేయకుండా ఆతిథ్య జట్టు తప్పు చేసిందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. కరోనాతో 6 నెలలకు పైగా నిలిచిపోయిన క్రికెట్.. వెస్టిండీస్, ఇంగ్లాండ్ తొలి టెస్టుతో ప్రారంభమైంది.
ఇందులో మొదటి మ్యాచ్‌లో విండీస్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన హుస్సేన్.. వెస్టిండీస్ జట్టు ఆటతీరును ప్రశంసించాడు.
"అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు వెస్డిండీస్ జట్టుకు హ్యాట్స్ఆఫ్. అయితే, నేను ఇంగ్లాండ్‌ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇది యాషెస్ మ్యాచ్ అయ్యుంటే.. బ్రాడ్‌ను వదిలేసేవారా? వెస్టిండీస్ జట్టుకు తక్కువ అంచనా వేసి ఇలా పొరపాటు చేశారా? అని ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ బ్రాడ్ జట్టులో ఉంటే.. స్టోక్స్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ ఎంచుకునే వాడు.. అప్పుడు కచ్చితంగా వెస్డిండీస్ పరాజయం పొంది ఉండేదని నా నమ్మకం."