ఒక ఆటగాడిని ధోనీ నమ్మకపోతే అతడిని దేవుడు కూడా కాపాడలేడని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ బద్రీనాథ్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు.. ధోనీ నాయకత్వ లక్షణాలపై స్పందించాడు.
"జట్టులో ఆటగాళ్ల పాత్రే కీలకమని ధోనీ ఎప్పుడూ భావిస్తాడు. అలాగే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడాల్సిన బాధ్యత నాపై ఉండేది. నా పాత్ర ఎప్పుడూ మిడిల్ ఆర్డర్‌లోనే ఉండేది. అయితే, ధోనీలో ఉన్న అతిపెద్ద సానుకూలాంశం ఏంటంటే.. అతడు ఆటగాళ్లకు అదనపు అవకాశాలిస్తాడు. ఒకసారి నేను బాగున్నానని ధోనీ నమ్మితే.. ఇక కచ్చితంగా నేను జట్టులో ఉన్నట్టే. తాను ఏదైతే కరెక్ట్ అని నమ్ముతాడో దానికి కట్టుబడి ఉంటాడు. ఆటగాళ్లకు అలా అవకాశాలిచ్చి వారిని వారే నిరూపించుకునేలా చేస్తాడు"
- బద్రీనాథ్
"ఎవరైనా ఆటగాడు సరిగ్గా ఆడలేడని ధోనీ భావిస్తే ఇక దేవుడు కూడా అతడికి సహాయం చేయలేడు. అలాంటి ఆలోచనా విధానంతో మహీ తన నిర్ణయాలకు కట్టుబడి ఉంటాడు. ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేసినా జట్టు యాజమాన్యం ధోనీ లాగే ప్రవర్తించేది. మా అందరి మధ్య మంచి అనుబంధం నెలకొంది. మా యాజమాన్యం ఎప్పుడూ మమ్మల్ని ఛాంపియన్లుగానే భావించింది. ధోనీ మా జట్టుకు కెప్టెన్‌గా ఉండటం వల్లే టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు ఛాంపియన్లుగానే మేం భావిస్తాం" అని బద్రి చెప్పుకొచ్చాడు.
ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. మొత్తం 12 సీజన్లలో ఇప్పటివరకు 9సార్లు ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఫలితంగా ముంబయి ఇండియన్స్ తర్వాత అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా చెన్నై నిలిచింది. అయితే ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్-2020పై ఇంకా అనిశ్చితి నెలకొని ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే అక్టోబర్‌లో ఈ మెగాటోర్నీ జరగుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.