ఐసీసీ12వప్రపంచకప్ టోర్నీ రేపటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ సంగ్రామానికి ఇంగ్లండ్, వేల్స్‌లోని 11 మైదానాలు అతిథ్యమివ్వనున్నాయి. 11 మైదానాల్లో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న ఫైనల్ మ్యాచ్ చారిత్రక లార్డ్స్ మైదానంలో జరగనుంది. మరి ఇంత గ్రాండ్ టోర్నీకి ఆతిథ్యమిస్తోన్న మైదానాల విశేషాలపై ఓ లుక్కేయండి.
లార్డ్స్, లండన్
205 ఏళ్ల చరిత్ర ఉన్న అత్యంత ప్రాచీన మైదానంగా... క్రికెట్ మక్కాగా గుర్తింపు పొందిన స్టేడియం లార్డ్స్. ఇక్కడ 1884లోనే ఓ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించారు. 1972 నుంచి వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోందీ స్టేడియం.
1983లో భారత కెప్టెన్ కపిల్‌దేవ్ వరల్డ్‌కప్‌ను ముద్దాడింది లార్డ్స్‌లోనే. నాట్‌వెస్ట్ సిరీస్ విజయ సంబరాల్లో సౌరభ్ గంగూలీ చొక్కావిప్పి సింహనాదం చేసిందీ ఇక్కడే. ఇంగ్లండ్‌లో ఇప్పటి వరకు నాలుగు వరల్డ్‌కప్‌లు జరిగితే ఆ నాలుగుసార్లు ఫైనల్ వేదిక ఇదే. ఈసారి ఫైనల్ సహా మొత్తం ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది లార్డ్స్. అయితే లీగ్ దశలో భారత్ ఆడే ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడ జరగకపోవడం మన అభిమానులను నిరాశ పరిచే అంశమే. విరాట్ సేన ఫైనల్ చేరితే లార్డ్స్‌లో భారత్ ఆటను మ్యాచ్ చూసే అవకాశం వస్తుంది.
ప్రత్యేకతలు : దక్షిణ.. పడమరల్లో 8 అడుగుల 2 అంగులాలు ఎక్కువగా గ్రౌండ్ విస్తరించి ఉంటుంది.
సామర్థ్యం: 28వేలు
నిర్వహణ: ఫైనల్‌తో కలిపి 5 మ్యాచ్‌లు
ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చింది ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం. 1882లో నిర్మించిన ఈ స్టేడియంలో 1902లో తొలి టెస్టు మ్యాచ్, 1972లో తొలి వన్డే జరిగింది. 1999 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య టైగా ముగిసిన మ్యాచ్ జరిగింది ఇక్కడే. ఈ మైదానంలో భారత రికార్డు అద్భుతంగా ఉంది. మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఏడు గెలిచి, మూడు మ్యాచ్‌లు ఓడింది. జూన్ 30న ఇంగ్లండ్‌తో, జులై 2న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడేది ఇక్కడే.
సామర్థ్యం: 25వేలు
నిర్వహణ: సెమీఫైనల్ సహా 5 మ్యాచ్‌లు
బ్రిస్టల్ - కంట్రీ గ్రౌండ్
1983 నుంచి ఈ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ జరగలేదు. ఈ సారి మూడు వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న బ్రిస్టల్ మైదానం... సామర్థ్యం పరంగా చిన్నది. ఈ వేదికపైనే అత్యధిక పరుగులు చేశాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.
సామర్థ్యం: 17వేల 500
నిర్వహణ: 3 మ్యాచ్‌లు
సోఫియా గార్డెన్స్, కార్డిఫ్
వేల్స్‌లోని సోఫియా గార్డెన్స్ క్రికెట్ మైదానం ఈసారి 4 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ప్రస్తుత ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిస్తోన్న స్టేడియాల్లో రెండో చిన్నది ఇది. దీన్నే స్వాలెక్ స్టేడియం అంటారు. 1999 వరల్డ్‌కప్ తర్వాత ఇక్కడ ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగలేదు. చివరిసారిగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు వేదికైంది సోఫియా గార్డెన్స్.
సామర్థ్యం: 15వేల 200
నిర్వహణ: 4 మ్యాచ్‌లు
రివర్ సైడ్ గ్రౌండ్, చెస్టర్లీ స్ట్రీట్
మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న చెస్టర్లీ స్ట్రీట్ మైదానం పేస్‌తో పాటు స్వింగ్‌కు అనుకూలించనుంది. 1995లో దీన్ని నిర్మించారు. 1999 వరల్డ్‌కప్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న ఈ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 16 మ్యాచ్‌లే జరిగాయి.
సామర్థ్యం: 19 వేలు
నిర్వహణ: 3 మ్యాచ్‌లు