మహిళా టీ20 విశ్వసంరంభానికి కొద్దిగంటలే సమయం ఉంది. ఓవైపు నాలుగు సార్లు విశ్వ విజేత ఆస్ట్రేలియా.. మరోవైపు తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టిన భారత్. మెల్‌బోర్న్ సాక్షిగా మహిళా టీ20లో కొత్త చరిత్ర లిఖించేందుకు హర్మన్ ప్రీత్ సేన ఉవ్విళ్లూరుతున్నాయి. ఇరుజట్ల మధ్య నేడు తుదిసమరం జరగనుంది. మధ్యాహ్నం 12.30గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాబలాలు ఓసారి పరిశీలిద్దాం.
డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మొదటి మ్యాచ్‌లోనే మట్టికరిపించి ప్రపంచకప్ వేట మొదలు పెట్టిన హర్మన్ ప్రీత్‌కౌర్ సేన.. మళ్లీ అదే జట్టుతో తుదిపోరుకు సిద్ధమైంది. ఫైనల్స్‌ను మైండ్‌గేమ్‌తో గెలవడం ఆసీస్‌కు వెన్నతో పెట్టిన విద్య అయితే.. ఆఖరి మెట్టుమీద ఒత్తిడికి గురవడం భారత జట్టుకు ఆనవాయతీగా వస్తోంది. కానీ ఈసారి చరిత్ర తిరగరాస్తామని హర్మన్ సేన అంటోంది.
భారత్‌లో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే జట్టంతా స్టార్లతో కళకళలాడుతోంది. అయితే మైదానంలో మాత్రం సారథి హర్మన్ ప్రీత్‌కౌర్ సహా ఓపెనర్ స్మృతి మంధాన ఈ ప్రపంచకప్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. షెఫాలీ వర్మ 4 మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించింది. ప్రతిజట్టుపై మంచి ఇన్నింగ్స్‌లు ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలిమ్యాచ్‌లో.. 15 బంతుల్లో 29 బాదిన వర్మ అందులో మేగాన్ షట్ వేసిన ఒక్క ఓవర్లోనే నాలుగు ఫోర్లు కొట్టింది. షెఫాలీతో పాటు వేదకృష్ణమూర్తి, దీప్తి శర్మ, రోడ్రిగ్స్ ఫర్వాలేదనిపించారు. భాటియా కూడా అవసరాలకు తగ్గట్టుగా ఆడుతోంది. హర్మన్‌ప్రీత్‌తో పాటు స్మృతి కూడా ఫైనల్‌లో ఫామ్‌లోకి వస్తే.. 150 పరుగుల మార్కు దాటొచ్చని.. అప్పుడు భారత్‌కు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు.