మెల్‌బోర్న్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లోనూ జయకేతనం ఎగురవేసింది మహిళా టీమిండియా. ఇప్పటికే సెమీస్ చేరిన హర్మన్ సేన.. నేడు లంకతో జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా టీ20 ప్రపంచకప్‌లో అపజయం ఎరుగని జట్టుగా దూసుకెళ్తోంది. బౌలింగ్‌లో రాణించిన రాధాకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
షెఫాలీ మరోసారి..
114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మంచి శుభారంభం అందించింది షెఫాలీ. ఈ మెగాటోర్నీలో మరోసారి అర్ధశతకం మిస్సైనా.. 47 పరుగులు (34 బంతుల్లో; 7 ఫోర్లు, 1 సిక్సర్)తో మెరుపులు మెరిపించింది. ఈమెకు తోడు మంధాన(17), హర్మన్(15), రోడ్రిగ్స్(15), దీప్తి(11) తలో చేయి వేసి లక్ష్యం పూర్తి చేశారు.
రాధా దెబ్బకు కుదేల్...
రాధా యాదవ్ (4/23) బంతితో చెలరేగడం వల్ల తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 113 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు సారథి ఆటపట్టు 33 (24 బంతుల్లో; 5ఫోర్లు, 1సిక్సర్), కవిష దిల్షారి 25* (16 బంతుల్లో; 2ఫోర్లు) రాణించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే దీప్తిశర్మ ఓపెనర్ ఉమేశ (2)ను పెవిలియన్‌కు చేర్చింది. అయినా వన్‌డౌన్‌లో వచ్చిన హర్షిత (12)తో కలిసి సారథి ఆటపట్టు ఇన్నింగ్స్‌ను దూకుడుగా కొనసాగించింది. అయితే రాజేశ్వరి అద్భుతమైన బంతితో హర్షితను క్లీన్‌బౌల్డ్ చేసింది. కొద్దిసేపటికే సిక్సర్ బాది ఊపు మీదున్న ఆటపట్టును కూడా రాధా పెవిలియన్‌కు చేర్చింది.
అనంతరం రాధా ధాటికి శ్రీలంక బ్యాటర్లు ఎక్కవుసేపు నిలవలేకపోయారు. ఆమెకి ఇతర బౌలర్లు కూడా సహకరించడం వల్ల క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ లంకను ఒత్తిడిలోకి నెట్టారు. ఆఖర్లో దిల్హారి ఒంటరి పోరాటంతో లంక 113 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో రాధా నాలుగు, రాజేశ్వరి రెండు, దీప్తి, పూనమ్ యాదవ్, శిఖ తలో వికెట్ తీశారు.