తెలంగాణ

telangana

ETV Bharat / sports

నేటి నుంచే అండర్‌-19 వరల్డ్‌కప్‌- ఫేవరెట్‌గా భారత్‌

ప్రపంచ స్థాయి ఆటగాళ్లను పరిచయం చేసే అండర్​-19 వరల్డ్​కప్​ నేటి నుంచే ప్రారంభంకానుంది. ఈ కుర్రాళ్ల టోర్నీలో భారత్​ ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది. ఈరోజు జరగనున్న తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. మ్యాచ్​ మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

ICC Under-19 WorldCup 2020
నేటి నుంచే అండర్‌-19 వరల్డ్‌కప్‌.. ఫేవరెట్‌గా భారత్‌

By

Published : Jan 17, 2020, 7:46 AM IST

విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మేటి బ్యాట్స్‌మెన్‌. ఈ ముగ్గురినీ క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం చేసిన టోర్నీ అండర్‌-19 ప్రపంచకప్‌. వీళ్లతో పాటు యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, పృథ్వీ షా లాంటి మన హీరోలు.. క్రిస్‌ గేల్‌, బెన్‌ స్టోక్స్‌, డేవిడ్‌ వార్నర్‌, షకిబుల్​ హసన్​ లాంటి విదేశీ వీరుల్ని వెలుగులోకి తెచ్చిందీ కుర్రాళ్ల కప్పే.

రెండేళ్లకోసారి యువ ప్రతిభకు వేదికగా నిలుస్తూ క్రికెట్‌ ప్రియుల్ని అలరించే ఈ టోర్నీ మళ్లీ వచ్చేసింది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌ నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఈ టోర్నీలో భారత్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా, అత్యంత విజయవంతమైన జట్టుగా బరిలోకి దిగుతోంది. ప్రియమ్‌ గార్గ్‌ నేతృత్వంలోని యువ 'మెన్​ ఇన్​ బ్లూ' అంచనాల్ని నిలబెట్టుకుంటుందా.? భారత్‌ మరో కప్పు అందించే ఆ భవిష్యత్‌ హీరోలెవరు? అనేది ఈ టోర్నీలో తేలనుంది.

16 జట్ల పోటీ...

గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ చూశాం. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్‌ను ఆస్వాదించబోతున్నాం. మధ్యలో ఇప్పుడు మరో ప్రపంచకప్‌ వచ్చేసింది. అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ నేడు ఆరంభమవుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు.. అఫ్గానిస్థాన్‌ను ఢీకొట్టనుంది. 16 జట్లు పోటీ పడే ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి.

ఈ ఏడాది అండర్‌-19 వరల్డ్‌కప్‌ సారథులు

ప్రియమ్‌ గార్గ్‌ నేతృత్వంలోని భారత్‌కు కప్పు ఆశలు బలంగానే ఉన్నాయి. యువ క్రికెటర్లను తనదైన శైలిలో తీర్చిదిద్దుతున్న కోచ్‌ ద్రవిడ్‌.. 2018 టోర్నీలో పృథ్వీ షా సేన కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి ప్రియమ్‌ గార్గ్‌ జట్టును కూడా కప్పు దిశగా బాగానే సన్నద్ధం చేశాడు.

సూపర్‌ ఫామ్‌లో ఉన్న గార్గ్‌కు తోడు యశస్వి జైశ్వాల్‌, ధ్రువ్‌ జురెల్‌, అధర్వ, తిలక్‌ వర్మ లాంటి యువ సంచలనాలు ప్రపంచ వేదికపై సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే దక్షిణాఫ్రికా పేస్‌ పిచ్‌లపై ఆతిథ్య జట్టుతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి బలమైన జట్లను దాటి కప్పు గెలవాలంటే భారత కుర్రాళ్లు కష్టపడాల్సిందే. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను 19న శ్రీలంకతో ఆడుతుంది.

ఫార్మాట్‌ ఇలా..:

అండర్‌-19 ప్రపంచకప్‌లో 16 జట్లు తలపడుతున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.

  1. గ్రూప్​-ఏ: న్యూజిలాండ్‌, శ్రీలంక, జపాన్‌, భారత్‌.
  2. గ్రూప్‌-బి: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, నైజీరియా
  3. గ్రూప్‌-సి: పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, జింబాబ్వే
  4. గ్రూప్‌-డి: దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, కెనడా, యూఏఈ

ప్రతి గ్రూపులోని జట్టూ మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌ దశ జనవరి 25న ముగుస్తుంది. 28 నుంచి క్వార్టర్స్‌.. ఫిబ్రవరి 4, 6 తేదీల్లో సెమీస్‌ జరుగుతాయి. ఫిబ్రవరి 9న ఫైనల్‌కు పోట్‌చెస్ట్‌రూమ్‌ ఆతిథ్యమిస్తుంది.

గ్రూప్​ దశలో భారత్​ మ్యాచ్​లు...

>> జనవరి 19 : శ్రీలంక - మధ్యాహ్నం 1.30 నుంచి

>> జనవరి 21: జపాన్​ - మధ్యాహ్నం 1.30 నుంచి

>> జనవరి 24: న్యూజిలాండ్​ - మధ్యాహ్నం 1.30 నుంచి

భారత్​ నంబర్‌వన్‌:

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ డిఫెండింగ్‌ ఛాంపియనే కాదు.. అత్యధిక సార్లు టైటిల్‌ గెలిచిన జట్టు కూడా. 1988లో ఈ టోర్నీ మొదలు కాగా.. ఆస్ట్రేలియా తొలి ఛాంపియన్‌గా నిలిచింది. తొలి టోర్నీ జరిగిన తర్వాత పదేళ్లకు రెండో టోర్నీ నిర్వహించారు. అప్పట్నుంచి ప్రతి రెండేళ్లకు ఓసారి ఈ టోర్నీ జరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 12 టోర్నీలు జరిగితే నాలుగు సార్లు కప్పు గెలిచిన భారత్‌... అత్యధిక టైటిళ్లతో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (3) రెండో స్థానంలో ఉంది.

2018లో టైటిల్​తో భారత్​

>> 2002లో పార్థివ్‌ పటేల్‌ సారథ్యంలో భారత్‌ తొలిసారి కుర్రాళ్ల ప్రపంచకప్‌ను అందుకుంది. 2008లో కోహ్లి నేతృత్వంలో రెండో కప్పు గెలిచింది. 2012లో ఉన్ముక్త్‌ చంద్‌ బృందం.. 2018లో పృథ్వీ షా సేన అండర్‌-19 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నాయి.

భారత యువ జట్టు...

ప్రియమ్ గార్గ్ (సారథి), ధృవ్​చంద్ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, శాశ్వత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభంగ్ హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుశాగ్ర (కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్.

15 మందితో యువ టీమిండియా

ABOUT THE AUTHOR

...view details