డిఫెండింగ్ ఛాంపియన్ యువ టీమిండియా మరోసారి ప్రపంచకప్ నెగ్గాలని పట్టుదలతో ఉంది. అండర్-19 వరల్డ్‌కప్‌లో ఓటమి ఎరుగని జట్టుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ తొలి సెమీఫైనలిస్టుగా అడుగుపెట్టింది ప్రియమ్ గార్గ్ నేతృత్వంలోని భారత జట్టు. అయితే ఈ మెగాటోర్నీ సెమీస్‌లోనే దాయాది దేశం పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరగుతున్న ప్రపంచకప్‌లో... ఫిబ్రవరి 4న ఈ ఇరుజట్ల మధ్య పోరు జరగనుంది.
క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాకు షాక్...
భారత యువ జట్టు ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించి అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం (జనవరి 28) జరిగిన క్వార్టర్స్‌లో 74 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, అథర్వ అంకోలేకర్, బౌలింగ్‌లో కార్తీక్ త్యాగి, ఆకాశ్‌సింగ్ అదరగొట్టేశారు. ఈ గెలుపుతో 2008 తర్వాత అండర్-19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను సెమీస్ చేరకుండా తొలిసారి అడ్డుకుంది భారత యువ జట్టు. అంతేకాకుండా అండర్-19 ప్రపంచకప్‌లో కంగారూ జట్టుపై గెలిచి... భారత్ వరుసగా పదో విజయం ఖాతాలో వేసుకుంది.