టీమిండియా సీనియర్ జట్టులోకి వచ్చే ముందు చివరి అడుగు అండర్-19. ఇక్కడ అద్భుత ప్రదర్శన చేస్తే భారత జట్టులో స్థానానికి రేసులో నిలవచ్చు. దక్షిణాఫ్రికాలో జనవరి 17 నుంచి ప్రారంభమైన అండర్-19 ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్ ఇవాళ ఆడనుంది భారత్.శ్రీలంకతోజరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన యువ టీమిండియా ఆశలకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలకం కానున్నాడు. కెప్టెన్ ప్రియమ్‌గార్గ్ జట్టులో అందరికన్నా అనుభవజ్ఞుడు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జట్టులో ఉన్నాడు. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న భారత్‌ను నిలువరించడం శ్రీలంకకు కష్టమైన పనే... మరి కీలకంగా ఉన్న ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దామా..
టీమిండియా కెప్టెన్ ప్రియమ్ గార్గ్(ఎడమ నుంచి రెండో వ్యక్తి) 'ప్రియమైన ఆటగాడు...
అండర్-19 జట్టుకు వెన్నెముక ప్రియమ్ గార్గ్. ఈ జట్టుకు కెప్టెన్ అయిన గార్గ్ కీలకమైన బ్యాట్స్‌మన్‌గానూ నిలవనున్నాడు. 2018లో దేశవాళీ అరంగేట్రం చేసిన ఈ ఉత్తర్‌ప్రదేశ్ కుర్రాడు ఇప్పటిదాకా 12 మ్యాచ్‌ల్లో 66.69 సగటుతో 867 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 206. లిస్ట్-ఎలో 90.87 స్ట్రయిక్ రేట్‌తో 707 పరుగులు చేశాడీ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్. ఇటీవల దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, జింబాబ్వే పాల్గొన్న నాలుగు దేశాల టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా గార్గ్ పాత్ర ఎంతో ఉంది.
సంచలనాల కేరాఫ్ అడ్రస్...
యశస్వి జైస్వాల్.. 2019లో భారత క్రికెట్లో సంచలనం రేపాడీ 18 ఏళ్ల కుర్రాడు. విజయ్ హజారె టోర్నీలో జార్ఖండ్‌పై 154 బంతుల్లోనే 203 పరుగులు చేసి లిస్ట్-ఎలో.. డబుల్ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడీ ముంబయి ప్లేయర్. ధనాధన్ ఆటకు పేరొందిన యశస్వి.. సిక్సర్లు కొట్టడంలో స్పెషలిస్ట్. ఒకవైపు పానీపురి అమ్ముతూ మరోవైపు క్రికెట్ శిక్షణ తీసుకుంటూ ఎన్నో కష్టాలు పడి పైకొచ్చిన యశస్వి.. అండర్-19 ప్రపంచకప్‌లోనూ తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటిదాకా 13 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 70.81 సగటుతో 779 పరుగులు చేశాడీ లెఫ్ట్ హ్యాండర్.
ఆల్‌రౌండర్ ధ్రువ తార...
ధ్రువ్ జురెల్.. అండర్-19 జట్టులో అతనో ఆల్‌రౌండర్. బ్యాటింగ్, వికెట్‌కీపింగ్‌తో పాటు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు 18 ఏళ్ల ధ్రువ్. ఇప్పటిదాకా ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడని ధ్రువ్.. అండర్-19 జట్టు తరఫున 81.02 స్ట్రయిక్ రేట్‌తో 47.44 సగటుతో పరుగులు సాధించాడు. ధ్రువ్‌ది సైనిక నేపథ్యం. అతని నాన్న నేమ్‌సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఏబీ డివిలియర్స్‌ను స్ఫూర్తిగా తీసుకునే ధ్రువ్.. అతనిలాగే ధనాధన్ ఆటను ఇష్టపడతాడు. అతని వీడియోలు చూసి ఏబీలా షాట్లు కొట్టే ప్రయత్నం చేస్తుంటాడు.
మలుపు 'తిప్పేస్తాడు'
అండర్-19 జట్టులో ప్రభావవంతమైన స్పిన్నర్ అథర్వ అంకోలేకర్. చక్కటి వైవిధ్యంతో పాటు ఫ్లయిట్‌తో ఈ ముంబయి బౌలర్ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో 5 వికెట్లు తీసి జట్టుకు టైటిల్ అందించడం వల్ల అథర్వ వెలుగులోకొచ్చాడు. అథర్వ నాన్న చిన్నప్పుడే చనిపోగా.. అతడి తల్లే అథర్వను క్రికెటర్‌గా తయారు చేసింది. బస్ కండక్టర్‌గా పని చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడి అతడి ఎదుగుదలలో కీలకపాత్ర పోషించింది. ఇప్పటివరకు 10 అండర్-19 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ 9.51 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు.
మిడిలార్డర్‌లో తెలుగోడు..
అండర్-19 ప్రపంచకప్‌లో ఆడుతున్న భారత జట్టులో తెలుగుతేజం ఠాకూర్ తిలక్‌వర్మ కూడా ఉన్నాడు. దేశవాళీ మ్యాచ్‌లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికైన ఈ హైదరాబాద్ టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మన్.. ఈ టోర్నీలో కీలకంగా మారనున్నాడు. మిడిలార్డర్‌లో నమ్మదగిన బ్యాట్స్‌మన్ అయిన తిలక్.. ఇప్పటిదాకా అండర్-19 తరఫున 10 మ్యాచ్‌ల్లో 41.07 సగటుతో 575 పరుగులు సాధించాడు. ఉపయుక్తమైన ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా అయిన తిలక్.. ఏడు వికెట్లు పడగొట్టాడు.
భారత యువ జట్టు...
ప్రియమ్ గార్గ్ (సారథి), ధృవ్చంద్ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, శాశ్వత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభంగ్ హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుశాగ్ర (కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్.