యశస్వి జైస్వాల్.. టీమిండియా క్రికెటర్ కావాలని ఎన్నో కలలు కన్నాడు. వాటిని సాకారం చేసుకొనే క్రమంలో ప్రస్తుతం అండర్ 19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికై అదరగొడుతున్నాడీ ఉత్తర్ ప్రదేశ్ కుర్రాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ సెమీస్‌లో పాకిస్థాన్‌పై శతకం బాది అజేయంగా నిలిచాడు. అలాంటి ఈ యువతేజం తన తండ్రికి ఇచ్చిన మాటలు నిజం చేస్తున్నాడు. దాయాది జట్టుపై శతకం బాది జట్టును గెలిపించాలని కోరాడట జైస్వాల్ తండ్రి. ఈ టోర్నీలో టాప్ స్కోరర్‌గా రాణించి భారత్‌కు ప్రపంచకప్ అందిస్తాడని తండ్రి భూపేంద్ర జైస్వాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఆటతీరు అద్భుతం...
చక్కని ఫుట్‌వర్క్ కలిగిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ తన వికెట్‌కు ఎంతో విలువ ఇస్తాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ నడిపిస్తూనే అలవోకగా సిక్సర్లు బాదగలడు. అందుకే ఇతడిని ఔట్ చేయడం బౌలర్లకు కష్టంగా మారుతోంది. ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో 312 రన్స్ చేశాడు. సగటు 156. భారత్ ఫైనల్ చేరడంలో బ్యాటింగ్‌లో కీలకంగా రాణిస్తున్నాడు.
కష్టాలనోర్చి ఆటపై మక్కువ..
11 ఏళ్ల వయసులో తండ్రితో ముంబయిలో అడుగుపెట్టాడు. పేద కుటుంబం నుంచి వచ్చినా క్రికెటర్ అవ్వాలని ఆశయం పెట్టుకున్నాడు. కొడుకు కలని నిజం చేయలేని తండ్రి అతడిని వదిలి సొంతూరు వెళ్లిపోయాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా తన కలని సాకారం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అలా ఆజాద్ మైదానం వద్ద పానీపూరీ అమ్ముతూనే క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. రోడ్డు పక్కన టెంట్‌లో గడుపుతూనే ఆటమీద దృష్టి సారించాడు. చివరికి ఎన్నో కష్టాలకోర్చి అండర్-19 యువ టీమిండియాలో చోటు సంపాదించాడు. ఈ మెగా ఈవెంట్‌లోనూ పరుగుల వరద పారిస్తూ..ఆకట్టుకుంటున్నాడు. జైస్వాల్ మరోసారి తుది రేసులోనూ అదరగొడితే భారత్ హ్యాట్రిక్ వరల్డ్‌కప్ అందుకోనుంది. అంతేకాకుండా భారత సీనియర్ జట్టులోనూ ఇతడు స్థానం పొందే అవకాశం ఉంటుంది!
యశస్వి తల్లిదండ్రులు కాంచన్ జైస్వాల్, భూపేంద్ర జైస్వాల్
ఎవరైనా కనపడితే.. టిఫిన్ పెట్టించమని అడిగేవాణ్ణి
" ఆజాద్ మైదానంలో పానీపూరీ అమ్మేవాడిని. నా తోటి ఆటగాళ్లు పానీపూరీ తినడానికి అక్కడకు రావొద్దని మొక్కేవాడిని. అయినా కొన్ని సందర్భాల్లో వాళ్లు వచ్చి నా వద్ద పానీపూరీ కొనేవారు. అప్పుడు నేను చాలా బాధపడ్డా. నా సహచరులను చూసి చాలా బాధ కలిగేది. వారి తల్లిదండ్రులు టిఫిన్‌బాక్సులు తెచ్చేవారు. ఇక నా విషయానికొస్తే స్వతహాగా వండుకొని తినాలి. ఉదయం వేళ అల్పాహారం ఉండేది కాదు. ఎవరైనా కనపడితే టిఫిన్ పెట్టించమని అడిగేవాణ్ణి. అలా ప్రతీరోజూ కాండిల్ లైట్ డిన్నరే ఉండేది. ఎందుకంటే మా టెంట్‌లో కరెంట్ ఉండేది కాదు. ఎండాకాలం ఆ టెంట్‌లో పడుకోవాలంటే చాలా వేడిగా ఉండేది. ఒక్కోసారి కటిక నేల మీదే పడుకునేవాడిని" అని జైస్వాల్ తన గురించి ఓ సందర్భంలో వివరించాడు.
పరుగులు కాదు.. మరుసటి పూటకు భోజనం కోసం ఆలోచించేవాణ్ణి
క్రికెట్‌లో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నావని అడిగితే.. తన జీవితంలో ప్రతీరోజూ ఒత్తిడిని ఎదుర్కొన్నానని చెప్పాడు. " ఆటలో పరుగులు చెయ్యడం ముఖ్యం కాదు. ఎందుకంటే నేను బాగా ఆడతానని గట్టి నమ్మకం. మరుసటి పూటకు భోజనం దొరుకుతుందా? లేదా అనేదే అప్పుడు నా మదిలో మెదులుతుండేది. కొన్నిసార్లు మధ్యాహ్నం పూట సిగ్గులేకుండా తోటి ఆటగాళ్లతో వెళ్లి భోజనం పెట్టించమని అడిగేవాణ్ణి. ఒక్కోసారి ఎవరైనా నన్ను ఎగతాళి చేస్తే పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే వాళ్లెప్పుడూ నాలా టెంట్‌లో పడుకోలేదు. నాలాగా పానీపూరీ అమ్మలేదు. ఆకలితో నిద్రపట్టని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ కఠిన పరిస్థితులే నన్ను రాటుదేలేలా చేశాయి" అని నాటి పరిస్థితులను యశస్వి గుర్తుచేసుకున్నాడు.
డబుల్ సెంచరీతో తొలి గుర్తింపు
ముంబయి క్రికెట్‌లో అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న జైస్వాల్.. గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతం చేశాడు. డబుల్ సెంచరీ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 17 ఏళ్ల వయసులో ఝార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 154 బంతుల్లో 203 పరుగులు చేశాడు. ఫలితంగా లిస్ట్-ఏ క్రికెట్‌లో ఈ ఘనత నమోదు చేసిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అలా మొదటిసారి తన ఉనికిని దేశానికి చాటిచెప్పాడు. ఈ టోర్నీలో మొత్తం 500పైనే పరుగులు సాధించి ఐపీఎల్‌పై కన్నేశాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది.