అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బుధవారం టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాట్స్‌మెన్ విభాగంలో విరాట్ కోహ్లీ మరో స్థానం కోల్పోయి 852 పాయింట్లతో ఐదో ర్యాంకుకు పడిపోయాడు. ఇటీవల శ్రీలంక, టీమ్ఇండియాతో జరగిన టెస్టులలో రెండు డబుల్ సెంచరీతో మెరిసిన ఇంగ్లాండ్ సారథి జో రూట్ రెండు స్థానాలు ఎగబాకి 883 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్(919) మొదటి స్థానాన్ని, ఆసీస్ స్టార్ స్మిత్(891) పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకున్నారు. మార్నస్ లబుషేన్(ఆసీస్), పుజారా(టీమ్ఇండియా) తమ స్థానాలను కోల్పోయి నాలుగు, ఏడు స్థానాలకు పరిమితమయ్యారు.
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్(91) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా 700పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు. దీంతో భారత్ తరఫున 700 పాయింట్లు సాధించిన తొలి వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు. శుభమన్ గిల్ 40, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 81వ స్థానాల్లో నిలిచారు.