అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) శనివారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగ 20 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం 21 స్థానంలో కొనసాగుతున్నాడు.
న్యూజిలాండ్-శ్రీలంక మధ్య శుక్రవారం జరిగిన మూడో టీ20లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు మలింగ. ఈ ఘనత సాధించడం మలింగకిది రెండో సారి. 2007 టీ20 ప్రపంచకప్‌లోనూ వరుస బంతుల్లో వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. అలాగే ఈ ఫార్మాట్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు.
బౌలర్ల విభాగంలో అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా.. కివీస్ స్పిన్నర్ సాంట్నర్ ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడీ చైనామన్ బౌలర్.