ఐసీసీ నిర్వహించే టీ20 ప్రపంచకప్‌కు కొన్ని నెలల సమయమే ఉంది. వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడలేక పోయిన టీమిండియా... ఇందులో ఎలాగైనా విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకే ఆస్ట్రేలియా గడ్డపై ఆడే జట్టు కూర్పుపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి. యువకులకు నిలకడగా అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండోర్‌లో శ్రీలంకతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు... మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీ20 ప్రపంచకప్‌కు తన జట్టును ఎంపిక చేశాడు. ఇందులో ఎంఎస్ ధోనీ, శిఖర్ ధావన్‌కు చోటివ్వలేదు. ఫలితంగా మళ్లీ ధోనీ రీఎంట్రీపై చర్చ మొదలైంది.
ఇద్దరి పరిస్థితి అంతేనా..?
- భారత జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ పునరాగమనంపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. జనవరి తర్వాతే తన భవితవ్యంపై ప్రశ్నలు అడగాలని మహీ గతంలోనే చెప్పాడు. అయితే ఐపీఎల్‌లో రాణించిన తర్వాతే టీమిండియాకు ధోనీ ఎంపికవ్వడంపై స్పష్టత రానుంది. ఇప్పటికే ఇతడి స్థానంలో వచ్చిన రిషబ్ పంత్‌పైనే ఎక్కువ దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా పంత్ వైపే కాస్త మొగ్గుచూపుతున్నట్లు క్రీడావర్గాలు భావిస్తున్నాయి.
- వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ వరుసగా గాయాల పాలవుతున్నాడు. ఫామ్ కోల్పోయాడు. పునరాగమనం చేసినప్పటికీ లయ అందుకోలేదు. మునుపటిలా ధాటిగా ఆడటం లేదు. ఈ క్రికెటర్ చివరి 12 టీ20 ఇన్నింగ్సుల్లో.. 110.56 స్ట్రైక్‌రేట్‌తో 272 పరుగులే చేశాడు. గబ్బర్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ జోరు ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే గబ్బర్ ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. ఎక్కువ మంది రోహిత్-రాహుల్ జోడీకే జై కొడుతూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.