2019 ప్రపంచకప్.. ఎన్నో తీపి గురుతులు, మరెన్నో చేదు జ్ఞాపకాలని మిగిల్చింది. కప్పు కొట్టాలనే ఆశతో బరిలోకి దిగిన టీమిండియా సెమీస్‌లో నిష్క్రమించింది. ఆతిథ్య ఇంగ్లాండ్ తొలిసారి విజేతగా నిలిచింది. ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి కారణం.. అత్యధికులు వీక్షించిన టోర్నీగా ఈ ప్రపంచకప్ నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం వేర్వేరు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల్లో కలిపి సుమారు 3.5 బిలియన్ల వీక్షణలు నమోదయ్యాయి. ఆ సమయంలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ల్లోనూ ఈ వీడియోలదే హవా.
ఐసీసీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 2.3 బిలియన్(230 కోట్ల) నిమిషాల సమాచారాన్ని, ఫేస్బుక్ పేజ్‌లో 1.2బిలియన్ల(120 కోట్ల) నిమిషాల వీడియోలను నెటిజన్లు వీక్షించారు.
ఎక్కువ మంది చూసిన వీడియో ఇదే
ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను హేళన చేయడం మొదలుపెట్టారు టీమిండియా అభిమానులు. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అతడిని దూషించడానికి బదులు చప్పట్లు కొట్టి ప్రశంసించాలని చెప్పాడు. ఐసీసీ ట్విట్టర్ పేజ్‌లో అత్యధికంగా వీక్షించిన వీడియోగా రికార్డు సృష్టించింది.
అత్యధిక ట్వీట్స్ వచ్చిన మ్యాచ్ ఇదే..!
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుండగా 2.9 మిలియన్ల ట్వీట్స్ చేశారు నెటిజన్లు. ట్విట్టర్లో అత్యధిక పోస్ట్‌లు వచ్చిన వన్డేగా ఈ మ్యాచ్ నిలిచిపోయింది.