ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణను 2022కు వాయిదా వేసే అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పరిశీలిస్తున్నట్లు సమాచారం. కరోనా సంక్షోభం కారణంగా టోర్నీని వాయిదా వేయాల్సిన పరిస్థితి రావచ్చని తెలుస్తోంది. ఈ నెల 28న జరగనున్న సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి రానున్నట్లు ఐసీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బంతికి చెమట, ఉమ్మిని రాయడాన్ని నిషేధించడం సహా మరికొన్ని సరికొత్త నియమాలను ప్రకటిస్తామన్నారు.
"ఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ముందు మూడు అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఆటగాళ్లను 14 రోజుల నిర్బంధంతో పాటు స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలనేది అందులో మొదటి అంశం. ప్రేక్షకులను అనుమతించకుండా టోర్నీ నిర్వహించాలనేది రెండో అంశం. ఇవి కుదరని పక్షంలో టోర్నీని 2022కు వాయిదా వేయడమనేది చివరి అంశం". - ఐసీసీ సీనియర్ అధికారి