టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ ఛాపెల్. అతడు రెండు నెలల్లో మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడని, చాలా మంది తమ జీవిత కాలంలో అలా చేయలేరని ఛాపెల్ అన్నాడు.
పంత్ ఆస్ట్రేలియా పర్యటనలో.. సిడ్నీ టెస్టులో 97, గబ్బా టెస్టులో 89*, తాజాగా ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో 101 శతకం సాధించాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడే పంత్ ఆదుకున్నాడు. ఈ నేపథ్యంలోనే యువ క్రికెటర్‌పై ఆసీస్ మాజీ సారథి ప్రశంసలు జల్లు కురిపించాడు.
"జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధాటిగా ఆడి పంత్ మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడు. చాలా మంది తమ కెరీర్ మొత్తంలో కూడా ఇలా చేయలేరు. అయితే, ఈ యువ క్రికెటర్ తన దూకుడు బ్యాటింగ్‌తోనే కాకుండా కీపింగ్‌లోనూ బాగా మెరుగయ్యాడు. పంత్ టీమ్ఇండియాలో పేరొందిన ఆటగాడు. అతడి స్ఫూర్తి, జట్టు ఆత్మవిశ్వాసానికి సరైన నిర్వచనం. ఇంగ్లాండ్‌లోనూ ఇలాంటి ఆటగాళ్లున్నారు. కానీ వారికి సరైన పరిస్థితులు అనుకూలించలేదు" అని ఛాపెల్ వివరించాడు.
ఇక ప్రస్తుత టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు పరుగులు చేయడానికి ప్రయత్నిస్తే.. ఇంగ్లిష్ క్రికెటర్లు వికెట్లు కాపాడుకునేందుకు యత్నించారని చెప్పాడు ఛాపెల్. ఇదే రెండు జట్ల మధ్య ప్రధాన తేడా అని ఆసీస్ మాజీ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి:పంత్‌కు వీలైనన్ని అవకాశాలు ఇవ్వాల్సిందే: లక్ష్మణ్