ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తిరిగి భాగమవుతుండటం ఉద్వేగంగా ఉందని టీమ్‌ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కెప్టెన్ ధోనీ కిందే లీగులో పునరాగమనం చేయడం అదృష్టమని పేర్కొన్నాడు. టీ20 క్రికెటర్‌గా తనకు అతిగా రేటింగ్ ఇచ్చుకోవడం లేదన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎక్కువ అవకాశాలు వస్తే జనాల దృక్పథం మారుతుందని వెల్లడించాడు.
టెస్టు స్పెషలిస్టుగా ముద్రపడ్డ పుజారా ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నాడు. ఈ సీజన్ వేలంలో రూ.50 లక్షల కనీస ధరకు చెన్నై సూపర్‌కింగ్స్ అతడిని తీసుకుంది. అతడిని తీసుకున్న వెంటనే మిగతా ఫ్రాంచైజీలన్నీ చప్పట్లతో అభినందనలు తెలిపాయి. "పుజారా లాంటి జాతీయ హీరోకు నిరాశ కలగనీయం" అన్న సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్ వ్యాఖ్యలపై చెతేశ్వర్ స్పందించాడు.
"జాతీయ జట్టుకు మంచి ప్రదర్శనలు చేసిన వారిని గౌరవించే ఫ్రాంచైజీకి ఆడుతున్నందుకు గర్వంగా ఉంది. మహీ భాయ్ సారథ్యంలో పునరాగమనం చేయడం నా అదృష్టం. నా అంతర్జాతీయ అరంగేట్రం ఆయన నేతృత్వంలోనే జరిగింది. సుదీర్ఘకాలం క్రికెట్‌తో అనుబంధం ఉన్న శ్రీనివాసన్ నా గురించి అలా మాట్లాడటం గొప్పగా అనిపించింది. ఇది నాకో భావోద్వేగ సందర్భం."