తన బాధ్యతలేంటో జట్టు యాజమాన్యం ముందే స్పష్టంగా చెప్పిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ అన్నాడు. దిల్లీ నుంచి బదిలీ చేసుకున్నప్పుడే ఆఖరి ఓవర్లు వేయాల్సి ఉంటుందని వివరించిందని తెలిపాడు. చివరి ఓవర్లు కట్టుదిట్టంగా విసిరేందుకు రెండుమూడేళ్లుగా శ్రమిస్తున్నానని వెల్లడించాడు. ముంబయిపై విజయం సాధించిన తర్వాత అతడు మాట్లాడాడు.
"బెంగళూరుకు ఆడటం సంతోషంగా ఉంది. జట్టు యాజమాన్యం నాపై విశ్వాసం ఉంచింది. కచ్చితత్వంతో బంతులు వేయడంపైనే దృష్టి పెట్టా. ఎందుకంటే జోరు కొనసాగించడం కీలకం. నేనాడిన 98 టీ20ల్లో ఐదు వికెట్ల ఘనత సాధించడం ఇదే తొలిసారి. అదీ ముంబయిపై కావడం మరింత ప్రత్యేకం. యార్కర్లు విసిరేందుకు ఎంతో సాధన చేశా. లెంగ్త్, నెమ్మది బంతులూ బాగా విసిరా. బాధ్యత తీసుకునే బౌలర్‌గా ఉండాలన్నదే నా లక్ష్యం."
-హర్షల్ పటేల్, ఆర్సీబీ బౌలర్
"నేను 16వ ఓవర్ వేసేటప్పుడు బంతి స్వింగ్ అవుతున్నట్టు గమనించా. ప్రతిసారీ ప్రత్యర్థిని చూడాల్సిన పనిలేదు. ప్రణాళికల ప్రకారం కచ్చితత్వంతో బంతులు వేస్తున్నామా లేదా చూసుకుంటే చాలు. ఆఖర్లో రెండు ఓవర్లు నేనే వేస్తానని తెలుసు. బ్యాటింగ్ చేసేందుకు పిచ్ అనువుగానే అనిపించింది. అయితే వేగం తగ్గించి బంతులు వేసేందుకు బాగుంది. ఉండాల్సినంత బౌన్స్ లేదు. రెండు వైపులా వేగం లేదు. అయినప్పటికీ ముంబయిపై ఐదు వికెట్ల ఘనత అందుకున్నందుకు ఆనందంగా ఉంది" అని హర్షల్ తెలిపాడు.
ముంబయితో మ్యాచులో హర్షల్ పటేల్ అద్భుతం చేశాడు. ఆ జట్టుపై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. కీలకమైన ఇషాన్ కిషన్ (28), హార్దిక్ పాండ్యా (13), కీరన్ పొలార్డ్ (7), కృనాల్ పాండ్యా (7), మార్కో జాన్సెన్ (0)ను పెవిలియన్ పంపించాడు. ముఖ్యంగా ముంబయి ఇండియన్స్ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి కేవలం ఒక పరుగే ఇవ్వడం గమనార్హం.
ఇవీ చూడండి: