టీమ్‌ఇండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో గొడవపడేందుకు ఓ సందర్భంలో అతడి గదికెళ్లానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చెప్పాడు. తాజాగా ఓ సామాజిక మాధ్యమంలో మాట్లాడిన పాక్ మాజీ పేసర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 2010 ఆసియాకప్ సందర్భంగా శ్రీలంకలోని డంబుల్లాలో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్, అక్తర్ గొడవపడ్డారు. మ్యాచ్‌లో ఒకర్నొకరు దూషించుకున్నారు. దీంతో మ్యాచ్ తర్వాత భజ్జీతో గొడవపడాలని నిర్ణయించుకున్నట్లు అక్తర్ పేర్కొన్నాడు.
"హర్భజన్ మాతో కలిసి తింటాడు, లాహోర్‌లో మాతో కలిసి తిరుగుతాడు. అతను పంజాబీ కావడం వల్ల మా మధ్య ఒకే తరహా సాంప్రదాయాలు ఉంటాయి. అయినా, అతను మాతో గొడవపడతాడు. ఆ రోజు మ్యాచ్ అయ్యాక అతని గదికెళ్లి గొడవపడాలనుకున్నా. అయితే మరుసటి రోజు క్షమాపణ చెప్పాడు" అని అక్తర్ వివరించాడు.
అసలేం జరిగిందంటే..
అక్తర్ వేసిన 47వ ఓవర్‌లో తొలుత హర్భజన్ లాంగాఫ్ మీదుగా ఓ భారీ సిక్స్ కొట్టాడు. అక్తర్‌కు కోపమొచ్చి భజ్జీని టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేశాడు. అలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అయితే, అమీర్ వేసిన చివరి ఓవర్‌లో టీమ్‌ఇండియా విజయానికి రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరమైన స్థితిలో భజ్జీ మరో సిక్స్ కొట్టి గెలిపించాడు.
ఇదే విషయాన్ని హర్భజన్ ఓసందర్భంలో ఒప్పుకున్నాడు. "అక్తర్.. నా గదికొచ్చి కొడతానని చెప్పాడు. దాంతో నేనూ.. "సరే, రా! ఎవరు ఎవర్ని కొడతారో చూసుకుందాం" అని బదులిచ్చా. కానీ, ఆ సమయంలో నేను నిజంగా భయపడ్డా. ఎందుకంటే అక్తర్ శరీర సౌష్టవం బలంగా ఉంటుంది." అని సీనియర్ స్పిన్నర్ భజ్జీ అన్నాడు. అయితే ఈ విషయాన్ని సురేశ్ రైనా కూడా ఇటీవల ఇర్ఫాన్ పఠాన్‌తో పంచుకున్నాడు. "భజ్జీ ఒక ఫైటర్. తనతో ఆడేటప్పుడు ఒకసారి అక్తర్‌తో గొడవపడ్డాడు. అది నాకు గుర్తుంది. చివరికి భజ్జీ సిక్స్ కొట్టి టీమ్‌ఇండియాను గెలిపించాడు" అని నాటి మ్యాచ్‌లో నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న రైనా వెల్లడించాడు.
ఇదీ చూడండి.. టీవీ సిరీస్‌లో నటించిన విరాట్ కోహ్లీ!