టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతడు అడుగుపెడుతున్నాడంటే చాలు.. క్రికెట్ అభిమానుల అంచనాలు పెరిగిపోతాయి. అయితే, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కన్న కలల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు యువీ.
ఒకప్పుడు తాను టెన్నిస్ ప్లేయర్ కావాలని అనుకున్నట్లు తెలిపాడు. చిన్నప్పుడు తన తండ్రి కొనిచ్చిన టెన్నిస్ రాకెట్‌ను విరిచేసిన సంఘనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తనకు కొత్తది కొనివ్వమని అడిగేందుకు చాలా భయపడినట్లు పేర్కొన్నాడు యువరాజ్.
"నాకు స్కేటింగ్, టెన్నిస్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో టెన్నిస్‌ను నా కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా. మా నాన్న నాకు ఓ రాకెట్ కొనిచ్చాడు. ఆ సమయంలో దాని విలువ రూ.2,500. ఒకసారి క్వార్టర్ ఫైనల్స్లోనో, ఇంకేదో మ్యాచ్‌లో ఆడుతూ చివరికి ఓడిపోయా. ఆవేశంలో రాకెట్‌ను విరిచేశా. ఆ తర్వాత మా నాన్నను మళ్లీ కొత్తది కొనివ్వమని అడగడానికి భయమేసింది".