ఎక్కడ విజేతగా నిలిచినా, ప్రపంచకప్ గెలవడం మాత్రం ప్రత్యేకమని అంటున్నాడు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ. వ్యక్తిగతంగా తనకు ప్రపంచకప్పులు అందుకోవాలని ఉందని చెప్పాడు.
"ప్రపంచకప్ గెలవడమనేది అందరి కల. వ్యక్తిగతంగానూ వరల్డ్కప్పులు గెలవాలని ఉంది. ప్రతిసారి భారీ అంచనాలతో టోర్నీలో బరిలోదిగి, ప్రతిమ్యాచ్ గెలవాలని అనుకుంటాం. అన్నిసార్లు అలా జరగదు. అయితే ప్రపంచకప్ ఎప్పటికీ ప్రత్యేకం, అత్యుత్తమం" -రోహిత్ శర్మ, భారత క్రికెటర్
2007 టీ20 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీ గెలిచిన టీమిండియాలో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఒక్కసారైనా వన్డే ప్రపంచకప్‌ను అందుకోలేకపోయాడు. అయితే ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్ ఉంటూ, నాలుగుసార్లు జట్టును విజేతగా నిలిపాడు.
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు రోహిత్. మొత్తంగా ఐదు శతకాలు సాధించి, 648 పరుగులు చేశాడు. అయితే ఈ టోర్నీలో భారత్.. న్యూజిలాండ్ చేతిలో సెమీస్‌లో ఓడి ఇంటిముఖం పట్టింది.