భారత బౌలర్లు వేసే బౌన్సర్లు ఎదుర్కోవడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని, వాటితో తనని సులువుగా ఔట్ చేయలేరని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అన్నాడు.
"బౌన్సర్లతో నన్ను ఔట్ చేయడానికి ప్రత్యర్థి జట్టు ప్రయత్నిస్తే కొన్నిసార్లు ఫలితం రావొచ్చు. ఎందుకంటే వరుసగా షార్ట్ బంతుల్ని శరీరంపైకి విసిరితే ఔట్ అవుతుంటారు. కానీ నా కెరీర్‌లో అలాంటి బంతుల్ని ఎన్నో ఎదుర్కొన్నాను. బౌన్సర్లు నన్ను ఒత్తిడికి గురిచేయలేవు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ బౌలర్లకు సమాధానం ఇస్తాను"
-స్మిత్, ఆస్ట్రేలియా క్రికెటర్.
న్యూజిలాండ్‌తో జరిగిన గత సిరీస్‌లో స్మిత్‌ను కివీస్ పేసర్ వాగ్నర్ షార్ట్‌పిచ్ బంతులతో నాలుగు సార్లు ఔట్ చేశాడు. అతడి శరీరానికి బంతులు తగిలేట్లుగా వరుసగా బౌన్సర్లు విసురుతూ పెవిలియన్‌కు చేర్చాడు. దీని గురించి స్మిత్ స్పందిస్తూ.. "కొన్ని ప్రత్యర్థి జట్లు ఔట్ చేయడానికి వాగ్నర్‌లా ప్రయత్నించాయి. వాగ్నర్‌కు అద్భుతమైన ప్రతిభ ఉంది. వేగంలో వైవిధ్యం ప్రదర్శిస్తూ బంతులు సంధిస్తాడు" అని అన్నాడు.
ఆస్ట్రేలియాతో సుదీర్ఘ పర్యటనలో భారత్ నవంబర్ 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. టీమ్ఇండియా టెస్టు జట్టులో పేసర్లు బుమ్రా, షమి, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. గాయం నుంచి కోలుకున్నాక ఇషాంత్ శర్మ కూడా జట్టులోకి వస్తాడు. వీళ్లని స్మిత్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం.
ఇదీ చూడండి : స్మిత్‌కు ఇక కెప్టెన్సీ దక్కదా?